Sunday, August 31, 2025

తీర్పులపై వక్రభాష్యాలు.. ఇదేం తీరు?

- Advertisement -
- Advertisement -

సల్వాజుడుం అంటే గోండు భాషలో శాంతియాత్ర అని అర్థం. ఇంగ్లీషులో పీస్ మార్చ్.. అంటే శాంతి సాధన కోసం జరిపే కవాతు అనుకోవాలి. గిరిజన తెగలు మాట్లాడుకునే స్థానిక భాషల్లో ఒకటైన గోండులో ఇది సల్వాజుడుం అని అర్థం కానీ చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని రమణసింగ్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలైన బస్తర్, దంతేవాడ వంటి చోట్ల శాంతిసాధన కోసం ప్రయోగించలేదు. అక్కడ బలంగా ఉన్న నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆనాటి చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ఆర్మీ సల్వాజుడుం.

2005 నుంచి 2011 దాకా దాదాపు ఆరు సంవత్సరాలు ఈ సల్వాజుడుం చేసిన ఘనకార్యం ఏమిటంటే ఆ ప్రాంతాల్లో మారణకాండకు కారకులు కావడం, అక్కడ నివసిస్తున్న గిరిజనుల మీదకు గిరిజనులనే పురిగొల్పడం కోసం ఏర్పడిన ఒక రాజ్యాంగేతర, చట్ట వ్యతిరేక వ్యవస్థ. సల్వాజుడుం ఏర్పడిన తర్వాత దానిని సుప్రీంకోర్టు రద్దు చేసేవరకు ఆ ప్రాంతంలో జరిగిన మారణకాండలో 1019 మంది గ్రామస్థులు, 42 మంది మావోయిస్టులు, 726 మంది భద్రతా బలగాలకు సంబంధించినవారు హతమయ్యారని, దాదాపు 55 వేల మంది గిరిజనులు పొరుగున ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వలసపోయారని అధికారిక లెక్కలే చెపుతున్నాయి. నందిని సుందర్ అనే ఒక మహిళా యాక్టివిస్ట్ వేసిన కేసులో జులై 5, 2011న సుప్రీం కోర్టు సల్వాజుడుంను వెంటనే రద్దు చెయ్యాలని తీర్పు ఇవ్వకపోయి ఉంటే ఇంకెంత మారణహోమం జరిగి ఉండేదో.

అటు ఇటు ఇంకా ఎన్ని వందల, వేల గిరిజనుల ప్రాణాలు పోయి ఉండేవో చెప్పనవసరం లేదు. ఈ తీర్పు వెలువరించిన ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, జస్టిస్ ఎస్‌ఎస్ నిజ్జర్. ఈ ఇరువురూ తమ తీర్పులో సల్వాజుడుమనేది ఒక చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి దాన్ని మూసివేయాల్సిందేనని తీర్పునిచ్చారు. అంతేకాదు, సల్వాజుడుం దగ్గర ఉన్న మారణాయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర పరికరాలన్నీ స్వాధీనం చేసుకోవాలని అప్పటి చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. సల్వాజుడుం వల్ల జరిగాయని ఆరోపణలు ఉన్న నేరాలన్నిటిమీద దర్యాప్తు కూడా జరపాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇరువురూ తీర్పు చెప్పారు. సల్వాజుడుంలో చేరినవారందరికీ ప్రత్యేక పోలీస్ అధికారి హోదా కల్పించారు. వారి విద్యార్హత ఐదవ తరగతి వరకు మాత్రమే. ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తుల్లో ఒకరైన సుదర్శన్ రెడ్డి మరో తీర్పు కూడా ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమం ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రభుత్వ భవనాలలో శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉన్న ప్రత్యేక పోలీసు దళాలను వెంటనే ఖాళీ చేయించాలని. మావోయిస్టుల అణచివేత పేరిట పాఠశాలలు, కళాశాలలు ఆక్రమించుకోవడం కుదరదని స్పష్టంగా తీర్పు చెప్పింది.

సల్వాజుడుం వంటి సంస్థలు అప్పట్లో చత్తీస్ గఢ్ ప్రజలకు కొత్తేమో కానీ మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా సాగిన రోజుల్లో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వంటి ప్రాంతాల ప్రజలకు మరో రూపంలో ఎంతో అనుభవంలో ఉన్నదే. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే 1986 ప్రాంతాల్లో అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం బలంగా ఉన్న కరీంనగర్‌లో పోలీసు సూపరింటెండెంట్ స్వయంగా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన అన్నెబోయిన మల్లయ్య అనే వ్యక్తి నాయకత్వంలో కొంతమంది ముఖాలకు ముసుగేసి తన క్యాంపు కార్యాలయంలోనే ‘ఫియర్ వికాస్’ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటింపజేశారు. నక్సలైట్లను ఎదుర్కోవడానికి, కట్టడి చేయడానికి, హతమార్చడానికి ఉద్దేశించి తాము ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పత్రిక సమావేశంలో మల్లయ్య చెప్పారు. ఇలా పోలీసుల ప్రోత్సాహంతో మరికొన్ని ఇటువంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. ‘గ్రీన్ టైగర్స్’ వంటిది వాటిలో బాగా ప్రచారంలోకి వచ్చిన సంస్థ. కొంతమంది ప్రభుత్వానికి లొంగిపోయిన మాజీ తీవ్రవాదులను కూడా ప్రభుత్వాలు పీపుల్స్ వార్ ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు వాడుకున్నాయి.

అలాంటి ప్రయత్నం లో భాగంగానే కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు, బయపు సమ్మిరెడ్డి, నయీముద్దీన్ వంటి మాజీ నక్సలైట్లు పోలీస్ శాఖలో అల్లుళ్లలాగా సౌకర్యాలు పొంది, ప్రభుత్వం కోసం పనిచేసిన విషయం తెలిసిందే. ఏకు మేకు అయి కూర్చున్న అటువంటివారిని వదిలించుకోవడానికి ఆ తరువాత వాళ్ళ సృష్టికర్తలు పడిన పాట్లు కూడా అందరికీ తెలిసినవే. బహుశా 80వ దశకంలో తెలంగాణలో జరిగిన ఈ ప్రయత్నాలన్నిటి స్ఫూర్తితోనే 2005లో సల్వాజుడుం ఏర్పడిందేమో. కానీ ఈ సంస్థలు, వ్యక్తులూ చేయలేకపోయినంత హింస సల్వాజుడుం అస్తిత్వంలో ఉన్న చాలా స్వల్ప కాలం, ఐదారు సంవత్సరాలలోనే జరిగింది. సల్వాజుడుంకు నాయకత్వం వహించిన మహేంద్రకర్మ, అంతకు ముందు ఫియర్ వికాస్ కు నాయకత్వం వహించిన అన్నెబోయిన మల్లయ్య ఇద్దరూ ఆ తర్వాత కాలంలో హత్యకు గురయ్యారు. ఇటువంటి రాజ్యాంగేతర, చట్టవ్యతిరేక వ్యవస్థల్ని సృష్టించినవారు పెద్దగా సాధించింది ఏమీ లేదు, అమాయక ప్రజలు.. అందునా పెద్దసంఖ్యలో పేద గ్రామస్తులు, గిరిజనులు హింసాత్మక ఘటనల్లో మరణించడం తప్ప. ఇప్పుడు సల్వాజుడుం ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఆ సంస్థను మూసివేయాలని తీర్పు ఇచ్చిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జరగబోతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్ష కూటమి తరఫున పోటీకి దిగడం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించగా ఆ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ సమర్థిస్తున్నాయి.

మొత్తం లోకసభ, రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నిక ఫలితం అందరికీ తెలిసిందే. ఇదొక సిద్ధాంతపరమైన పోటీయే. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ నిపుణులు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఏ రాజకీయ పక్షానికీ చెందినవారు కాదు. నిజానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్, శాసనసభల స్పీకర్లు వంటి పదవుల్లో రాజకీయాలతో సంబంధంలేని వారిని నియమిస్తే నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అయితే ఆ పరిస్థితి ఎప్పుడో పోయింది. ఇప్పుడు స్పీకర్లు, గవర్నర్లు, ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతుల పదవులను రాజకీయ పార్టీల నాయకులే అధిష్టిస్తున్నారు.
ఎవరినీ నమ్మించలేని ఆరోగ్య కారణాలు చూపించి అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి కనీసం అధికారికంగా వీడ్కోలుకు కూడా నోచుకోకుండా జగ్దీప్ ధన్‌ఖడ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా మాయమైన కారణంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అవసరం ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ తన అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ వ్యక్తి సిపి రాధాకృష్ణన్‌ను ఎంచుకున్నది.

కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రం రాజ్యాంగ నిపుణుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ఎంతో అనుభవం కలిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసుకున్నది. ఇది కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నచ్చలేదు. ఆయన సల్వాజుడుం విషయంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2011లో ఇచ్చిన తీర్పును.. అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రస్తావించి ఆయన నక్సలైట్లకు అనుకూలుడని, ఆయన ఆ తీర్పు ఇచ్చి సల్వాజుడుంను రద్దు చేయించకపోయి ఉంటే 2020లోనే తాము నక్సలిజాన్ని అంతం చేసి ఉండేవాళ్ళమని వ్యాఖ్యానించారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు సమాజంలో అసమానతలు ఉన్నంతవరకూ ఆ ఉద్యమాలను అంతం చెయ్యడం సాధ్యం కాదన్న విషయం, తేదీలు ఖరారు చేసి మరీ నక్సలిజాన్ని అంతం చేస్తానని అత్యున్నతమయిన ప్రజాస్వామ్య వేదిక పార్లమెంటులోనే ప్రకటించిన అమిత్ షా వంటి వారికి ఎవరు చెప్పగలరు?.

అంతేకాదు, ప్రత్యేక పోలీసు దళాలు పాఠశాల భవనాల్ని, కళాశాల భవనాలను ఇతర ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకోవడంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి మరో తీర్పు ఇచ్చారు. ఇది ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన విద్యా హక్కుకు భంగం కలిగించడమేనని ఇచ్చిన తీర్పు కూడా సాక్షాత్తు ఈ దేశ హోం మంత్రికి నచ్చలేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ రాజకీయ పక్షానికీ చెందినవారు కాదు. ఆయన ఒక రాజ్యాంగం నిపుణుడు. ప్రజాస్వామ్యవాది. మానవతా విలువలు కలిగినవారు. లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ సిద్ధాంతాలకు ప్రభావితుడైనవారు. జయప్రకాశ్ నారాయణ అనుయాయులంతా తీవ్రవాద సమర్థకులే అయితే ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ మీద పోరాటం చేసి విజయం సాధించి, ఆయన తెచ్చిన జనతా ప్రభుత్వంలో తమ పూర్వాశ్రమం అయిన జనసంఘీయులు ఎందుకు పాలు పంచుకున్నారో అమిత్ షా చెప్పాలి. అంతెందుకు, 2013 మార్చిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గోవాకు తొలి లోకాయుక్తగా నియమితులయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి, బిజెపి నేత మనోహర్ పారికర్ కూడా హాజరయ్యారు. సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు మద్దతు ఇచ్చారన్న మాటే నిజమైతే, మరి అప్పడు గోవాలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం తెలపలేదనే ప్రశ్నకు కమలనాథులు ఏం సమాధానం చెబుతారు?.

సుదర్శన్ రెడ్డి హింసను ఎక్కడా సమర్ధించిన లేదా ప్రోత్సహించిన సందర్భాలు లేవు. సల్వాజుడుంను నిషేధిస్తూ ఇచ్చిన తీర్పులో వారు ప్రభుత్వానికి హింస అనే బెడదను ఎదుర్కొనే సంపూర్ణ హక్కు ఉందని, ఆ హక్కును అవుట్ సోర్స్ చేయడం సరికాదని స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు, హింసను ఎదుర్కోవడం అనేది ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన బాధ్యత అని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు. హింస మీద పోరాటం చేస్తున్నామన్న నెపంతో ఇంకొక హింసాత్మక వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రోత్సహించడం సమంజసం కాదని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు. అలా చేయడం వల్ల ప్రజలు రెండు గుంపులుగా విడిపోయి పోరాడుకునే పరిస్థితి వచ్చి హింస మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు.

అటువంటి తీర్పు వెలువరించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి తమకు వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనపై నక్సలైట్ ముద్ర వేసే ప్రయత్నం దేశ హోం మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమిత్ షా వంటి వారు చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. ఇది దేశంలోని న్యాయమూర్తులందరి మీదా దుష్ప్రభావం చూపే అవకాశం లేదా ప్రమాదం ఉందని జస్టిస్ కొరియన్ జోసెఫ్, మదన్ బీ లోకూర్, జె. చలమేశ్వర్ సహా 18 మంది సుప్రీం కోర్టు, హైకోర్టులకు చెందిన విశ్రాంత న్యాయమూర్తులు ఒక ఉమ్మడి ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పుల్లో ఎక్కడా నక్సలిజానికి గానీ, వారి సిద్ధాంతానికి గానీ మద్దతు తెలపలేదని వారు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఏ రాజకీయ పక్షమయినా ఎల్లకాలం అధికారంలో ఉంటామనుకోవడం పగటి కలే. ఇలా తీర్పులను తిరగతోడటం, పెడర్ధాలు తీయడం మొదలుపెడితే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచెయ్యలేని పరిస్థితి దాపురిస్తుంది.

దేవులపల్లి అమర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News