ప్రైవేటు బడి (private educations) ఫీజు భారమైంది. అక్షరాలు దిద్దించడానికే లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్కూల్ ఫీజులు గణనీయంగా పెరిగాయి. 5% దాటని ధనవంతుల సంగతి పక్కనపెడితే మిగతా 95% మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఈ ఆర్థిక భారం మోయలేక పిల్లలకు మంచి చదువులు చెప్పించలేక మనోవేదనకు గురవుతున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు సర్వత్రా ఇదే పరిస్థితి. ముఖ్యంగా గత మూడేళ్లలో స్కూల్ ఫీజులు అనేక రెట్లు పెరిగాయని స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాల ఫీజులు మూడు ఏళ్లలోనే 50 నుంచి 80 శాతం పెరిగాయని తాజా జాతీయ సర్వే సైతం నిర్ధారించింది. స్కూల్ ఫీజులపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారీతిగా ఏటా ఫీజులు పెంచుకుంటూ వెళ్తున్నారు.
దీంతో పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులకు తడిసి మోపెడవుతున్నది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 44 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలో గత మూడేళ్లలో ఫీజులు 50 నుంచి 80 శాతం పెరిగాయని చెప్పినట్లు సర్వే నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న 309 జిల్లాల్లోని 31 వేల మంది స్కూల్ విద్యార్ధుల తల్లిదండ్రులపై ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 93 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల అధిక ఫీజుల నియంత్రణపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆశలను అవకాశంగా మలుచుకున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వివిధ పేర్లతో బురిడీ కొట్టిస్తున్నాయి. దీంతో అత్యాశకుపోయి లక్షలు కుమ్మరిస్తూ భారం భరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్కూల్ ఫీజులు గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు గ్రామర్, కాన్సెప్ట్ స్కూళ్లు అంటేనే అదేదో బ్రహ్మ పదార్థంలా చూసేవారు.
ఇప్పుడు కాన్సెప్ట్ పోయి టాలెంట్, టెక్నో, ఇ- టెక్నో, డిజి, మోడల్ స్కూల్, ఐఐటి, జెఇఇ, సివిల్స్ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులను ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు పాఠశాల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా ఏటా 20 నుంచి 30% ఫీజులను (private educations) యాజమాన్యాలు యథేచ్ఛగా పెంచుతూ వెళ్తున్నాయి. జీవో నెంబర్ 91 ప్రకారం దరఖాస్తు రుసుం రూ. 100, అడ్మిషన్ ఫీజు రూ. 500 మాత్రమే తీసుకోవాలి. పాఠశాలలో పుస్తకాలు, విద్యా సామగ్రిని కొనుగోలు చేయాలన్న నిబంధనలు పెట్టరాదు. సెక్షన్ -8(1) ప్రకారం విద్యా సంస్థ పేర్లకు ఇంటర్నేషనల్, ఐఐటి, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఇ -టెక్నో వంటి పదాలను చేర్చకూడదు. జిఒ 88 ప్రకారం 200 మంది విద్యార్థులు చదివే పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి.
అగ్నిమాపక సామగ్రిని అందుబాటులో ఉంచాలి. కానీ ఏ ఒక్క కార్పొరేట్ విద్యా సంస్థల్లో అగ్నిమాపక సామగ్రిని పెట్టడం లేదు. కనీసం నోటీసు బోర్డుపై ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తామో కూడా చెప్పకుండా, పరిమితి లేకుండా ఫీజులను వాళ్లే నిర్ణయించేస్తున్నారు. చాలా పాఠశాలల్లో ఎత్తయిన గోడలు, ఎసి తరగతి గదులు, ప్రత్యేకమైన టేబుళ్లు, కుర్చీలు, ఎసి బస్సులు, డిజిటల్ బోర్డులు, డిజిటల్ మెటీరియల్ చూపి, భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణంగా, టైర్ 1, టైర్ 2 నగరాల్లో ప్రైవేట్ స్కూళ్ల ట్యూషన్ ఫీజులు ప్రతి నెలా రూ. 2,500 నుండి రూ. 8,000 వరకు ఉంటాయి. కొన్ని స్కూళ్లు వార్షిక ఫీజులు కూడా విధిస్తాయి. ఇవి ఒక్కో స్కూల్‌కి ఒక్కో విధంగా ఉంటాయి. ఉదాహరణకు ముస్సోరీలోని వుడ్‌స్టాక్ స్కూల్ భారతదేశంలో అత్యంత ఖరీదైన పాఠశాలలలో ఒకటి. వార్షిక ఫీజులు రూ. 18 లక్షలకు చేరుకుంటున్నాయి. ప్రైవేట్ స్కూల్ ఫీజులు తల్లిదండ్రులకు ఒక ప్రధాన అంశం. ఫీజులు చాలా ఎక్కువగా ఉండటం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్చడానికి వెనకడుగు వేస్తున్నారు.
కొన్ని రాష్ట్రాలు, నగరాలు ఫీజులను నియంత్రించడానికి చట్టాలు, నిబంధనలు తీసుకువచ్చాయి. కానీ మన రాష్ట్రంలో విద్యా కమిషన్ వున్నా స్కూల్ ఫీజులలో ఎటువంటి మార్పు లేదు. విద్యార్థుల నుండి తీసుకున్నటువంటి ఫీజులో పాఠశాల నిర్వహణ, విద్యుత్, అద్దె ఖర్చులు, 15 శాతం స్కూల్ అభివృద్ధికి ఉపయోగించాలి. 15 శాతం ఫీజును స్కూల్ సిబ్బందికి బీమా, భవిష్య నిధి కోసం కేటాయించాల్సి ఉంటుంది. 2008 జిఒ నెం. 90, 91, 92 ప్రకారం ఫీజు నిర్ణయించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, విద్యార్థి సంఘాలు, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధితో కమిటీని ఏర్పాటు చేయాలి. దీనికి కలెక్టర్ చైర్మన్‌గా ఉండాలి. ఈ కమిటీ పాఠశాలను పరిశీలించి మౌలిక సదుపాయాలు, పరిస్థితి చూసి ఎంత ఫీజులు వసూలు చేయాలనే విషయమై నివేదిక ఇస్తుంది. దీనిపై విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే ప్రభుత్వపరంగా ఓ ప్రకటన విడుదల చేయాలి. జిఒ నెంబర్ 42 ప్రకారం ఫీజులను పెంచాలంటే జిల్లా ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. రోజురోజు ఫీజులు పెంచుతున్నారు తప్ప తగ్గించడం లేదు. ఫీజుల నియంత్రణ, టీచర్ల నియామకం, డొనేషన్ల వసూలు వంటి అంశాల్లో విద్యా హక్కు చట్టం చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా వాటిని పాటించడం చాలా ప్రైవేట్ పాఠశాలల్లో కనిపించడం లేదు.
చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించేలా చర్యలు తీసుకోవాలని విద్యా నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల పేరుతో డొనేషన్లు వసూలు చేస్తే రూ. 25,000 నుండి రూ. 50,000 వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కనీసం 25 శాతం సీట్లు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన విద్యా హక్కు చట్టంలో ఉంది. కానీ దీనిపై కూడా పర్యవేక్షణ లేదు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. చట్టాన్ని ఉల్లంఘించే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా విద్యా వ్యవస్థను నడిపే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్- 12 ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలని చట్టం చెబుతుంది.
సెక్షన్- 12 ప్రకారం టీచర్ విద్యార్థుల నిష్పత్తి 1:20 కి మించరాదు. చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం (private educations) 25% సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి. ఇవేకాకుండా పాఠశాలల్లో మున్సిపాలిటీ పరిధిలో అయితే 1000 చదరపు మీటర్ల ఆట స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు దేన్నీ పాటించడం లేదు. ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, విద్యావేత్తలు, మేధావులు, అధికారులు సభ్యులుగా ఉన్నటువంటి ఫీ రెగ్యులేషన్ కమిటీ ఫీజులను నియంత్రణ చేసే నియంత్రణ వ్యవస్థ ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను ధిక్కరించిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, చిన్న విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఉద్యమం చేపట్టినటువంటి బాధ్యత ఉంది. ఈ విధంగా చేసినట్లయితేనే అధిక ఫీజులను వసూలు చేయకుండా ఉంటుంది. ఫీజులను కొంతమేరకు నియంత్రించవచ్చు.
మోటె చిరంజీవి
99491 94327