తెల్లారితే ఇంటికి చేరుకుంటామన్న వారి కలలు కళ్లలుగానే మిగిలిపోయాయి. రోడ్డు ప్రమాదంలో వారి బతుకులు తెల్లారిపోయాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా, అడ్డాకుల మండలం, కాటారం స్టేజి వద్ద సోమవారం తెల్లవారుజామున 44 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుది. ముందు వెళ్తున్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కడప జిల్లా, ప్రొద్దుటూరుకు ప్రయాణికులను తీసుకెళ్తున్న సివిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అడ్డాకుల మండలం, జా
తీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు క్లీనర్ హసన్ (35), రాయలసీమ, నంద్యాలకు చెందిన ఆస్రాన్ ఉన్నీసా (70), ప్రొద్దుటూరు మండలం, కమలాపురంనకు చెందిన యల్లమ్మ (40)తో పాటు మరో మహిళ మృతి చెందింది. జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరగడంతో ట్రాఫిక్ స్థంభించింది. సమాచారం అందుకున్న జడ్చర్ల సిఐ కమలాకర్‌రావు, అడ్డాకుల ఎస్‌ఐ శ్రీనివాస్, భూత్పూర్ ఎస్‌ఐ చంద్రశేఖర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ఆ రెండు భారీ వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.