గత కొన్ని రోజులుగా వేతనాల పెంపు కోసం సినీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజాగా చిరంజీవి రంగంలోకి దిగారు. గతంలోనే చిరంజీవిని కలిసిన సినిమా నిర్మాతలు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అయితే ఫెడరేషన్ నేతలతోనూ తాను చర్చలు జరిపిన తర్వాతే తన అభిప్రాయాన్ని వెళ్ళడిస్తానని చిరంజీవి చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి.. దీనిని ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ చర్చల ద్వారానే పరిష్కారం ఆలోచించమని సూచించారు. కానీ ఛాంబర్, ఫెడరేషన్ మధ్య పలు సార్లు చర్చలు జరిగినప్పటికి పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం చిరంజీవిని ఆయన నివాసంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు విడివిడిగా కలిసి మాట్లాడారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో నిర్మాతలు, కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాలను గురించిన సమాచారం చిరంజీవి సేకరించారని తెలుస్తోంది. ఇక చిరంజీవితో చిన్న నిర్మాతలు కూడా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో నట్టికుమార్, సురేందర్ రెడ్డి, యలమంచిలి రవి, ఆచంట గోపీనాథ్, కేశవరావు పాల్గొన్నారు. సినీ కార్మికుల సమ్మె, చిన్న నిర్మాతల సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం నిర్మాత నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా బాధలను చిరంజీవికి వివరించామని అన్నారు. చిన్న సినిమాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరాం. సోమవారం ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో మాట్లాడుతానని చిరంజీవి అన్నారు. సమస్య పరిష్కారానికి చిరంజీవి కృషి చేస్తానన్నారని చెప్పారు’ నట్టికుమార్. అయితే చిరంజీవితో జరిగిన భేటీ సందర్భంగా నిర్మాత సీ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘సినీ కార్మికుల వేతనాలపై చాంబర్, యూనియన్లు చర్చలతో ముందుకెళ్లాలని చిరంజీవి సూచించారు. సామరస్యంగా చర్చలు జరిపి షూటింగ్ మొదలు పెడితే ఓకే.. లేకపోతే రెండు రోజుల వరకూ వేచిచూస్తానని ఆయన చెప్పారు. అప్పటిదాకా మీరు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అప్పటికీ పరిష్కారం కాకపోతే తన నిర్ణయం చెబుతానని చిరంజీవి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చిరంజీవి సూచనను పాటిస్తాము’ అని అన్నారు.