Wednesday, July 23, 2025

ప్రొటోకాల్ రగడ

- Advertisement -
- Advertisement -
  • కాంగ్రెస్, బిఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలు
  • ఇందిరమ్మ ఇళ్లపై రాజకీయం చేయొద్దు : మంత్రి గడ్డం వివేక్
  • నూకలు లేని సన్నబియ్యం అందించాలి: హరీశ్‌రావు
  • సిద్దిపేట సభలో గందరగోళం

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/సిద్దిపేట అర్బన్: సిద్దిపేట కలెక్టరేట్‌లో సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్ మండలం, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలానికి చెందిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రాల పంపిణీ సందర్భంగా ప్రొటోకాల్ రగడ తలెత్తింది. కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎంఎల్‌ఎ హరీశ్‌రావు సమక్షంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ శ్రేణులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో దుబ్బాక ఎంఎల్‌ఎ కొ త్త ప్రభాకర్ రెడ్డి ఫొటో అసలే వేయలేదని బిఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఒకరిపై మరొకరు నినాదాలు చే సుకుంటున్న ఇరు పార్టీల నాయకులను పోలీసులు సర్దిచెప్పడంతో అనంతరం సభను కొనసాగించారు. మంత్రి వివేక్ మాట్లాడుతున్న క్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా మంత్రి వారిపై అసహనం వ్యక్తం చేశారు. అసలు బిఆర్‌ఎస్ పాలనలో ఎన్ని ఇండ్లు మంజూరు చేశారని వారిని మంత్రి ప్రశ్నించారు.

ఇందిరమ్మ ఇళ్లపై రాజకీయం చేయవద్దని సూచించారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యకు కూర్చోవడానికి కుర్చీ సైతం వేయకపోవడంతో అధికారులపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారుల కోసం సరైన ఏర్పాట్లు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ..రాష్టంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో రాజకీయం చేయవద్దని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని తెలిపారు. ప్రజా పాలన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల నూతన రేషన్ కార్డులను అందిస్తున్నామని అన్నారు. నాణ్యమైన సన్న బియ్యం సరఫరా అయ్యేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు.

నూకలు లేని నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించాలి: హరీశ్‌రావు
నూకలు లేని నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్ రావు హితవు పలికారు. రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంలో 40 నుంచి 50 శాతం నూకలు ఉంటున్నాయని, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. బియ్యం పంపిణీపై జిల్లాలో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వస్తున్నాయని క్షేత్రస్థాయిలో పరిశీలించి పేదలు ఎదుర్కొంటున్న సమస్యకు సత్వర పరిష్కారం చూపి ఇచ్చిన మాట ప్రకారం, మంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.

ఎస్‌సి, ఎస్‌టి, బిసి హాస్టళ్లలో సన్న బియ్యం అందించి, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం, కెసిఆరే అని అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా ఈనెల నుంచే సన్నబియ్యం కోటా అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ కె హైమావతి, ఎంఎల్‌సి యాదవ రెడ్డి, దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, సిద్దిపేట అర్బన్, కొండపాక తహసిల్దార్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News