“ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు… నేను వారిని కలిశానని, వారు కోరిన విధంగా 30శాతం వేతన పెంపు వంటి డిమాండ్లను నెరవేరుస్తానని హామీ ఇచ్చానని చెబుతున్న వార్తల్లో నిజం లేదని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని వార్తలపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. త్వరలోనే తాను షూటింగ్ ప్రారంభిస్తానని కూడా వారితో అన్నట్టు మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చిరంజీవి అన్నారు. “నేను ఫెడరేషన్ కు చెందిన ఏ ఒక్కరిని కలవలేదని నిరూపించగలను.
అలానే సినిమా పరిశ్రమకు చెందిన ఓ సమస్యను ఒక వ్యక్తి ఒక విధంగానో, మరో విధంగానో ఏకపక్షంగా పరిష్కరించడం జరిగేది కాదు. ఫిల్మ్ ఛాంబర్ (Film chamber) అనేది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన అత్యున్నత సంస్థ. కేవలం ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే సమిష్టిగా సంబంధిత వ్యక్తలతో చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం కనుగొంటుంది. అప్పటి వరకూ వేచి ఉండాలి తప్పి తే… ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం సరైనది కాదు. ఈ రంగానికి చెందిన వారి మధ్య గందరగోళం సృష్టించడానికి నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను”అని చిరంజీవి ఎక్స్‌లోని పోస్ట్‌లో పేర్కొన్నారు.