హైదరాబాద్: తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా ఉంటుందని తెలంగాణా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. అవకాశం ఉన్న ప్రతిచోటా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామని అన్నారు. ప్రజాభవన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఆర్టిసికి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వ్యాపారం చేసుకునే మహిళలను ప్రోత్సహిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలియజేశారు.
ఐదేళ్లలో మహిళలకు రూ. లక్ష రుణాలు ఇవ్వాలనేది లక్ష్యమని, మహిళలకు తమ ప్రభుత్వం (Women own government) కల్పిస్తున్న లబ్ది గురించి చర్చించాలని అన్నారు. గ్రామాలు, మండలాల్లో మహిళా సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 10 నుంచి 16 వరకు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సమావేశాలు జరగనున్నాయని చెప్పారు. వడ్డి లేని రుణాల నగదును చెక్కుల రూపంలో అందిస్తామని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపై ప్రజలకు వివరించాలి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.