చండీగఢ్: భారీ వరదలతో పంజాబ్ రాష్ట్రం అతలాకుతలమైంది. అత్యంత దారుణ వరదలతో జనజీవనం స్థంభించిపోయింది.
దశాబ్దాలలో ఎన్నడూ లేనంత దారుణమైన వరదలు సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది. విపత్తు నిర్వహణ చట్టం, 2025 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ (SEC) ఛైర్మన్‌గా, విపత్తు పరిస్థితులు తలెత్తితే చట్టంలోని సెక్షన్ 34 కింద అవసరమైన ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రధాన కార్యదర్శి K.A.P. సిన్హా జిల్లా న్యాయాధికారులకు అధికారం ఇచ్చారు.
బాధిత ప్రజలకు సహాయం అందించడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా విపత్తు నిర్వహణ అధికారుల (DDMAలు)ను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర శాఖలు అత్యవసర సహాయ విధులను ఖచ్చితంగా పాటించాలని, తగినంత మంది సిబ్బంది ఎల్లప్పుడూ విధుల్లో ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా పనుల శాఖ(PWD), జల వనరుల శాఖ, పంజాబ్ రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL)తో సహా కీలక విభాగాలకు యుద్ధ ప్రాతిపదికన అవసరమైన సేవలను పునరుద్ధరించే బాధ్యతను అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా మొబైల్, ల్యాండ్‌లైన్ కనెక్టివిటీని నిర్ధారించాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను అధికారులు ఆదేశించారు.
అధికారిక సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఇప్పటివరకు వివిధ కనీసం 30 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. పంజాబ్‌లోని 23 జిల్లాల్లో 1,400 గ్రామాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సెప్టెంబర్ 7 వరకు మూసివేసినట్లు విద్యా శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ ప్రకటించారు.