Sunday, August 10, 2025

15న పుతిన్, ట్రంప్ చర్చలు

- Advertisement -
- Advertisement -

అలస్కాలో కలుసుకుంటానని స్వయంగా ప్రకటించిన ట్రంప్
ఉక్రెయిన్ యుద్ధవిరమణపై చర్చిస్తానని వెల్లడి
కొన్ని భూభాగాలపై సార్వభౌమాధికారం మారవచ్చునని ప్రకటన 
భారత్, పాక్ ఘర్షణ నిలిపానని మరోసారి పాత పాట
అంగుళం భూమిని వదలనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టీకరణ
ఉక్రెయిన్ ప్రమేయం లేని శాంతి ఒప్పందం చెల్లనేరదని వెల్లడి
ఆక్రమణదారుకు భూములు ధారాదత్తం చేసే ప్రసక్తే లేదన్న జెలెన్‌స్కీ

వాషింగ్టన్ : ఉక్రెయిన్ యుద్ధ నివారణ చర్చలకు తాను రష్యా అధ్యక్షులు పుతిన్‌తో శుక్రవారం (ఆగస్టు 15) సమావేశం అవుతానని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అలస్కాలో తమ భేటీ జరుగుతుందని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. యుద్ధం నిలిపివేత విషయంలో పుతిన్ వైఖరి పట్ల ట్రంప్ పూర్తి స్థాయిలో విరుచుకుపడుతూ వస్తున్నారు. ఈ ఘర్షణ నివారణకు ఎటువంటి ప్రయత్నాలు జరుగడం లేదని ఆయన తెలిపారు. అయితే ట్రంప్ ప్రకటనను క్రెమ్లిన్ అధికార వర్గాలు ధృవీకరించలేదు. అయితే వచ్చే వారం ఏదో ఒక సమయంలో చర్చలు ఉంటాయని ఇరుదేశాలు ఇంతకు ముందు తెలిపాయి. ఈ దశలో ట్రంప్ ప్రకటించినట్లు పుతిన్‌తో చర్చలు జరిగితే సామరస్యపూరిత ముగింపునకు దారితీస్తుందా? అనేది అనుమానంగానే మారింది.

రష్యా, ఉక్రెయిన్‌లు రెండూ కూడా శాంతి స్థాపన విషయంలో తమ షరతులపై వెనకకు తగ్గేలా లేవు. రష్యా అధినేతతో చర్చలలో పలు అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందని ట్రంప్ వివరించారు. కొన్ని ప్రాంతాల పరస్పర మార్పిడి లేదా అప్పగింతలకు అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. మూడు సంవత్సరాల యుద్ధంలో తాము ఉక్రెయిన్ నుంచి కైవసం చేసుకున్న ప్రాంతాల విషయంలో రష్యా రాజీకి వచ్చే అవకాశం లేదు. అయితే వీటి వెలుపలి ప్రాంతాలపై పట్టుకు దిగకుండా ఉంటుందని వెల్లడైంది. ట్రంప్ ఏదో విధంగా ఇక్కడ శాంతి స్థాపనకు దిగి. ఈ ఘనత తనకు దక్కేలా చేసుకునేందుకు ఉక్రెయిన్ ప్రయోజనాలను పక్కకు పెట్టే అవకాశాలు లేకపోలేదని కూడా పరిశీలకులు వ్యాఖ్యానించారు.

భారత్-పాక్ ఘర్షణ నిలిపింది నేనే: మరోసారి పాత రికార్డుతో ట్రంప్
సకాలంలో తాను జోక్యం చేసుకోవడం వల్లనే భారత్ పాక్ ఘర్షణ నిలిచిపోయిందని ట్రంప్ మరోసారి తెలిపారు. తన జోక్యం లేకపోతే ఇది చివరికి అణు ఘర్షణకు దారితీసి ఉండేదన్నారు. వైట్‌హౌస్‌లో శనివారం ఆయన మాట్లాడారు. నాలుగురోజుల పాటు జరిగిన సైనిక చర్యలలో ఐదు లేదా ఆరు యుద్ధ విమానాలు నేల కూలాయని చెప్పారు. అయితే ఏ దేశపు యుద్ధ విమానాలనేది చెప్పలేదు. ట్రంప్ పదేపదే వల్లిస్తున్న మాటలపై భారతదేశం తరచూ ఖండన వెలువరిస్తూ వస్తోంది. ట్రంప్ జోక్యం విషయంపై పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రకటనకు ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి.

అణువంత అయినా వదిలేది లేదు: జెలెన్‌స్కీ
తమ దేశంలోని అణువంత ప్రాంతాన్ని ఇతరులకు వదులుకునే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. 15వ తేదీన ట్రంప్ పుతిన్ అలస్కాలో సమావేశం అవుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ స్పందించారు. ఎటువంటి చర్చలు అయినా తమ దేశ ప్రమేయం ఉండాల్సిందే. కీవ్‌ను సంప్రదించకుండా ఎటువంటి శాంతి ఒప్పందం కుదిరినా అది పనికిమాలినదే అవుతుందని ఆయన హెచ్చరించారు. టెలిగ్రామ్ ద్వారా ఆయన వెలువరించిన ప్రకటన ట్రంప్ దూకుడుకు హెచ్చరికగానే భావిస్తున్నారు. రష్యా నేరాలకు తాము పతకాలు కట్టబెట్టదల్చుకోలేదని, ఆక్రమణదారుకు ఇక్కడి ప్రాంతాల ధారాదత్తం ప్రసక్తే లేదన్నారు. రష్యాకు , ఇతరులకు కానీ ఉక్రెయిన్ల కలిసికట్టు జవాబు ఇదే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News