డీ డాలరైజేషన్ విషయమై భారత ప్రభుత్వం చిక్కుముళ్లలో ఇరుక్కుని ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. అమెరికా డాలర్‌కు గాని, డాలర్ ఆధిపత్యానికి గాని తాము వ్యతిరేకం కాదని, ఆధిపత్యాన్ని తగ్గించే చర్యలకు అనుకూలం కాదని విదేశాంగ మంత్రి జై శంకర్ ఇప్పటికి పలుమార్లు ప్రకటించారు. ఈ నెల మొదటి వారంలో బ్రెజిల్ నగరమైన రియో డిజనేరో లో జరిగిన బ్రిక్స్ సమావేశాలలోనూ ఈ ప్రస్తావన చేసారు. తర్వాత రోజులలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో అదే మాట చెప్పారు. ప్రశ్న ఏమంటే బ్రిక్స్ కూటమిలోని మరే దేశమూ చేయని ఈ తరహా ప్రకటనలను భారతదేశం ఎందుకు చేస్తున్నట్లు? దానిని బట్టే అర్థమవుతున్నది. మోడీ ప్రభుత్వం ఈ ప్రశ్నపై ఏవో చిక్కుముళ్లలో ఇరుక్కుని ఉందని. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే, డాలర్‌ను ఆధిపత్య స్థానం నుంచి తొలగించగలమని గాని, డీ డాలరైజేషన్ జరపగలమని ఇంతవరకు ఇదమిత్థంగా అసలు ఎవరూ అననేలేదు.
ఒక సంస్థగా బ్రిక్స్ గాని, అమెరికా (BRICS, America) ప్రధాన ప్రత్యర్థులుగా రష్యా, చైనాలు గాని ఎపుడూ ప్రకటించలేదు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ఇప్పటికి 17 సార్లు జరిగాయి. వాటికి ప్రాముఖ్యత మొదటి 15 సార్లు అంతగా లేదు. అందువల్ల అమెరికా గాని, ప్రపంచం గాని ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత 16వ సమావేశాలు నిరుడు రష్యాలోని కజాన్ నగరంలో, 17వ సమావేశాలు ఇదే జులైలో బ్రెజిల్ లోని రియో నగరంలో జరిగినపుడు అకస్మాత్తుగా ప్రాధాన్యత ఏర్పడింది. అందుకు కారణాలు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు మారుతుండటం ఒకటైతే, అమెరికా శిబిరపు ఒత్తిళ్లను ఆమోదించలేని వర్ధమాన దేశాలు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తుండటం మరొకటి. ఈ స్థితి గతంనుంచే ఉండగా, ఇటీవలి సంవత్సరాలలో ఆ ధోరణి పెరుగుతున్నది. అందువల్లనే అమెరికా ఎకధ్రువ ప్రపంచ స్థానంలో బహుళ ధ్రువ ప్రపంచపు సృష్టి అనే మాట ఇపుడు విరివిగా వినవస్తున్నది.
బ్రిక్స్ పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహాన్ని, ఆ సంస్థ అమెరికాకు వ్యతిరేకమైనదని ఆరోపించటాన్ని, అందులో చేరే దేశాలపై అదనపు సుంకాలు విధించగలమంటూ హెచ్చరించటాన్ని ఈనేపథ్యంలో అర్థం చేసుకోవాలి. ఇంతకూ కజాన్, రియో డిక్లరేషన్ల పూర్తి పాఠాలను చూసినట్లయితే వాటిలో అమెరికాకు గాని, డాలర్‌కు గాని వ్యతిరేకంగా సూటిగా ఒక్కటంటే ఒక్క మాటయినా కనిపించదు. అయినప్పటికీ ట్రంప్‌కు ఈ అభిప్రాయం ఎందుకు కలుగుతున్నట్లు? భారత ప్రభుత్వానికి సైతం ఎందుకట్లా తోస్తున్నట్లు? డాలర్‌కు వ్యతిరేకంగా ఏమి చేసినా 100 శాతం సుంకాలు విధించగలమని ట్రంప్ కొన్ని నెలల క్రితమే హెచ్చరించారు. తాము డాలర్‌కు వ్యతిరేకంగా ప్రత్యేకంగా ఏమీ చేయటం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కజాన్ సమావేశాల తర్వాత స్పష్టం చేయగా, మోడీ ప్రభుత్వం కూడా అపుడు అదే మాట అన్నది. ఇపుడు రియో సమావేశాలు తర్వాత కూడా.
జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయాలు సరిగా ఇక్కడనే ఉన్నాయి. అనకుండానే అనటం, నిప్పు లేనిదే పొగరాదనే సామెత వంటివి ఈ విషయంలో బాగా వర్తిస్తాయి. చర్చలోకి వెళ్లేముందు కజాన్, రియో డిక్లరేషన్లలో ఏముందో చూద్దాం. బ్రిక్స్ సభ్యదేశాలు తమ మధ్య జరిగే ఎగుమతి, దిగుమతుల వాణిజ్యానికి చెల్లింపులు తమ స్థానిక కరెన్సీలలో జరుపుకునేందకు వీలైనంత ప్రయత్నించాలని, అదే విధంగా బ్రిక్స్ బయటి దేశాలతోనూ ప్రయత్నించాలని కజాన్ డిక్లరేషన్ ఒక కీలకమైన సూచన చేసింది. దీనితో పాటు మరికొన్ని ఉన్నాయి గాని ముందుగా ఈ సూచనకు అర్థమేమిటి, దాని ప్రభావమేమిటి చూద్దాం. సర్వసాధారణంగా అన్ని దేశాల మధ్య అన్ని రకాల చెల్లింపులు డాలర్ మారకంలో జరుగుతుంటాయి. కొన్ని దశాబ్దాల క్రితం భారత రష్యాల మధ్య రూపాయి రూబుల్ చెల్లింపులు ఉండేవి గాని తర్వాత ఆగిపోయింది. అదట్లుంచితే, ఇటువంటి వాణిజ్యం లేదా ఇతర రూపాలలో మారకం అన్నదంతా తమ కరెన్సీలో జరగటం అమెరికాకు ఒక పెద్ద బలం అయింది.
ఆ బలాన్ని ఉపయోగించుకుని ఇతర దేశాల ముడివనరుల ధరలు తగ్గించటం, తమ ఉత్పత్తుల ధరలు పెంచటం, తమ కరెన్సీ విలువ పెంచి ఇతరులది తగ్గించటం వంటిది యథేచ్ఛంగా చేసేవారు. ఇది ఎంత వరకు వెళ్లిందంటే, అంతర్జాతీయంగా చెల్లింపులు స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్) అనే వ్యవస్థ ద్వారా జరుగుతాయి. అది కేవలం బ్యాంకుల మధ్య ఏర్పడిన అసోసియేషన్. పూర్తిగా స్వతంత్రంగా పని చేయవలసినటువంటిది. కాని కేవలం ఆ చెల్లింపుల మారకం తమ డాలర్ రూపంలో ఉంటుంది గనుక, దానిని ఆధారం చేసుకుంటూ, తమకు నచ్చని దేశాల చెల్లింపులను స్విఫ్ట్‌పై ఒత్తిడి చేసి నిలిపివేస్తున్నారు. ఇది ఒక దుర్మార్గం కాగా, పశ్చిమ దేశాలలోని బ్యాంకులలో గల ఇతర దేశాల డాలర్ డిపాజిట్లను స్తంభింపజేస్తున్నారు. వాస్తవానికి ఆ డిపాజిట్ల వ్యవహారం ఆ దేశాలకు, బ్యాంకులకు సంబంధించినది. అమెరికాకు కాదు గదా ఏదేశానికీ వాటిపై నియంత్రణ ఉండదు.
అయినప్పటికీ బ్యాంకులపై ఒత్తిడితో ఆ పని చేస్తున్నారు. అట్లా ఇటీవల రష్యా, ఇరాన్‌ల డిపాజిట్లు బిలియన్ల కొద్దీ స్తంభింపజేయటమే గాక, వాటిపై వచ్చే వడ్డీలను తామే స్వాధీనం చేసుకుని ఉక్రెయిన్ వంటి దేశాలకు అప్పగిస్తున్నారు.ఈ చర్యలపై ప్రత్యేక వ్యాఖ్యానాలు అవసరం లేదు. ఇది కాకుండా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటివి తమ నియంత్రణలో ఉన్నందున చేస్తూ వస్తున్నవి అనేకం ఉన్నాయి. ఈ రకరకాల పరిస్థితుల నుంచి బయటపడే తరుణోపాయం ఏదంటే, డాలర్ ఆధిపత్యం తొలగిపోవటమని ఎవరైనా చెప్పగలరు. అయితే, అందుకు ప్రత్యామ్నాయం ఒకటి రూపు తీసుకోవటం, సభ్యదేశాలు సిద్ధపడటం జరిగే వరకు ఆ లక్షం నెరవేరదు. అది అంత తేలికైన పని కూడా కాదు. జాగ్రత్తగా తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్లవలసిన విషయం. ఈ ఉద్దేశాలు, జాగ్రత్తలు బ్రిక్స్ వ్యవస్ధాపకులకు ఉన్నాయి. కనుకనే అందుకు తొలి అడుగులుగా డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలలో చెల్లింపులు పద్ధతిని ముందుకు తెచ్చారు.
ఇది వివిధ దేశాల దృష్టిని ఆకర్షించిగా, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 శాతం చెల్లింపులు స్థానిక కరెన్సీలలో జరుగుతున్నట్లు అంచనా. ఇది గాక బ్రిక్స్ పక్షాన న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్‌ను ఏర్పాటుచేసి వర్ధమాన దేశాలకు అందజేస్తున్న అభివృద్ధి రుణాలు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌లకు భిన్నంగా ఉన్నాయి. ఈ విధమైన చర్యలు అమెరికాన్ డాలర్ ఆధిపత్యాన్ని సహజమైన రీతిలో క్రమంగా తగ్గించేవే. తగ్గిస్తున్నవే. ట్రంప్ సాహెబ్ కో గుస్సా క్యోం ఆతాహై అంటే ఇవన్నీ సమాధానాలు. డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయగలమని లిఖిత పూర్వకంగా పైకి అనరు. అదొక వ్యూహం. కాని ఆచరణలో జరుగుతూపోయేది అదే.
అమెరికాకు ఇవన్నీ ఆగ్రహ కారణాలవుతున్నాయి. ఇతరత్రా కూడా వివిధ కారణాల వల్ల ఇటీవల అమెరికా ఆర్థిక వ్యవస్థ, డాలర్ కరెన్నీ బలహీనపడుతుండటం తెలిసిందే. మూలిగే నక్కపై తాటి పండువలే బ్రిక్స్ చర్యలు పరిణమిస్తున్నాయి. బహుళ ధ్రువ వ్యవస్థ ఎంత త్వరగా ఆవిష్కృతమవుతుందా అని వేచిచూస్తున్న వర్ధమాన దేశాలకు ఈ పరిణామాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అందువల్లనే, స్థానిక కరెన్సీ చెల్లింపులు, స్విఫ్ట్ వ్యవస్థకు బదులు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఏర్పాట్లు, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల స్థానంలో బ్రిక్స్ బ్యాంక్ వంటివి డీ డాలరైజేషన్‌కు దారి తీయగలవని అర్థమైనప్పటికీ అంతరంగంలో ఆహ్వానిస్తున్నాయే గాని వ్యతిరేకించటం లేదు.
చిక్కుముళ్లు వచ్చిపడింది. మోడీ ప్రభుత్వానికి మాత్రమే. ఈ పరిణామాలు వాస్తవ రూపంలో ఇండియా వంటి వర్ధమాన దేశానికి మేలు చేసేవేనని తెలియక కాదు. అందుకే స్థానిక కరెన్సీలలో చెల్లింపులను స్పష్టంగానే బలపరుస్తున్నారు. ఆ పని చేయటం ఇప్పటికే మొదలు పెట్లారు కూడా. అదే విధంగా డాలర్ విలువకు ప్రతిగా రూపాయి విలువ ఎట్లా తగ్గుతున్నదో కనిపిస్తున్నదే గనుక అది కూడా విచారకరమైన పరిస్థితే. అందువల్ల భారత వాణిజ్యంపై రుణాల తిరిగి చెల్లింపుపై, వడ్డీ భారంపైగల ప్రభావం తక్కువ కాదు. కనుక డీ డాలర్‌రైజేషన్‌ను అంతర్గతంగా ఆహ్వానిస్తూనే ఉండి ఉంటారు. కాని ఆమాటపైకి అనలేరు. అందుకు ఒక కారణం అమెరికాను ధిక్కరించలేనితనం.
రెండవది, బ్రిక్స్‌పైన ఎక్కువ పలుకుబడి చైనాది అయినందున, ఆ సంస్థలోని దేశాలన్నీ చైనా మొగ్గుగలవి కనుక, ఆ స్థితికిలోబడి ఉండలేరు. మూడవది, చైనాతో గల ఇతర సమస్యల వల్ల రాజకీయంగా అమెరికా మద్దతును ఆశిస్తున్నపుడు డీ డాలరైజేషన్‌ను అంగీకరించటం కష్టమైనపని. నాల్గవది, భారత ఆర్థిక వ్యవస్థ, అమెరికాను నుంచి భారతీయుల చెల్లింపులు, ఐటి రంగం డాలర్‌తో బాగా పెనవేసుకుపోయి ఉన్నాయి. ఆ విధంగా చూసినపుడు డాలర్ బలహీనత ఇండియా ఆర్థిక వ్యవస్థను బలహీన పరుస్తుంది. అయిదవది, అమెరికా తోడ్పాటుతో అన్ని విధాలుగా ఎదగాలని, తమ రక్షణకు అమెరికా అండ అవసరమని మోడీ ప్రభుత్వపు యోచన. ఇవి అన్నీ చిక్కుముళ్లను సృష్టిస్తున్నాయి. అవుననలేని, కాదనలేని పరిస్థితిని. ఇది మారగల అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవు.
- టంకశాల అశోక్ (దూరదృష్టి)
- రచయిత సీనియర్ సంపాదకులు