Monday, August 18, 2025

ఇసికి ప్రేమతో మోడీ కొత్త చట్టం

- Advertisement -
- Advertisement -

ఔరంగాబాద్: కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ ఆదివారం రాత్రి బీహార్‌లో ఎన్నికల సంఘం ప్ర ధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌పై ఘా టుగా స్పందించారు. ప్రతిపక్షాల పట్ల వివక్ష లేదని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బిజెపి సాగించే ఓట్ల చోరీకి ఎన్నికల సంఘం సహకరిస్తూ ఉన్నందున అందుకు ప్రత్యుపకారంగా మోడీ ప్రభుత్వం ఏకంగా ఓ చట్టం తీసుకువచ్చిందని చెప్పారు. ఇది పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి తంతు అయిందన్నారు. ఎన్నికల సంఘం చర్యలపై ఎవరూ ఎటువంటి చర్యలకు పాల్పడకుండా పూర్తి స్థాయి రక్షణ కల్పించే చట్టాన్ని కేంద్రం మోడీ  సారధ్యంలో తీసుకువచ్చింది. ఇది ఇసిని కాపాడే లోపాయికారి ఒప్పందం ఫలితం అని విమర్శించారు. తమ ఓటరు అధికార్ యాత్ర మొదటి రోజు ముగింపు సందర్భంగా ఆయన ఔరంగాబాద్‌లో మాట్లాడారు. సిఇసి వ్యాఖ్యలపై, అఫడవిట్ సమర్పించాలనే సవాలుపై స్పందించారు. తనను అఫిడవిట్ అడుగుతున్నారు . మరి బిజెపి నేతలు ఓట్ల అక్రమాల ఆరోపణలకు దిగితే వాటిపై ఎన్నికల సంఘం ఎందుకు స్పందించలేదని రాహుల్ ప్రశ్నించారు. బిజెపి అధికారం కోసం ఓట్ల చోరీ జరిగిందనేది నిజం. ఇసిని రక్షించేందుకు బిజెపి సర్కారు చట్టం తీసుకువచ్చిందనేది మరీ పచ్చి నిజం అని తేల్చిచెప్పారు. బిజెపికి ఓ న్యాయం, ఇతర పార్టీలకు మరో న్యాయం చేస్తూ అన్ని పార్టీలూ తమకు ఒక్కటే అని సిఇసి చెప్పడం ప్రజాస్వామ్యం పట్ల పరిహాసమే అన్నారు. తన చర్యలను సమర్థించుకునేందుకు ఎన్నికల సంఘం విలేకరులసమావేశం పెట్టింది. మంచిదే అయితే ఇందులోనూ అసత్యాలకు దిగారు కదా అని రాహుల్ విమర్శించారు.

ఎన్నికల ప్రక్రియల సిసిటివీ ఫుటేజ్‌ల నిబంధనల చట్టంలో ప్రభుత్వం ఎందుకు మార్పులు తలపెట్టిందని తాను ఈ విషయాన్ని సిఇసిని ప్రశ్నిస్తున్నానని చెప్పారు. సిసిటీవీ ఫుటేజ్‌లు చూపెట్టడకుండా ఇసికి రక్షణ కల్పించారు. ఎందుకంటే అవి వెలుగులోకి వస్తే బిజెపి అక్రమాలు బయటపడుతాయని, అధికారానికి గండి పడుతుందనే భయం అని విమర్శించారు. ఓట్ల చోరీ క్రమంలోనే ఇప్పుడు అప్పటి చట్టం గురించి కూడా జాతికి తెలియాల్సి ఉందన్నారు. దేశంలోని ఏ కోర్టులో కూడా ఎన్నికల సంఘం చర్యలపై వ్యాజ్యాలు దాఖలు కాకుండా చట్టం తీసుకురావడం అసాధారణమా కాదా? ఇది ఏ స్థాయి వివక్షత అని రాహుల్ నిలదీశారు. అమిత్ షా, మోడీలు సాగిస్తోన్న దేశ వ్యాప్త ఓట్ల చోరీకి ఎన్నికల సంఘం బాసటగా ఉన్నందునే , అందుకు స్పందనగా 2023 చట్టం వచ్చిందని రాహుల్ చెప్పారు. దీనితో పలు ఇంతకు ముందటి నిబంధనలు లేకుండా పొయ్యాయి. ఓట్ల కోసం బిజెపి ఆగడాలకు వత్తాసు పలికే ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. తమది అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ పోరు, వారిది అధికార భద్రతా వెంపర్లాట అని విమర్శించారు. ఇందుకు ఎన్నికల సంఘం రక్షణ కవచం కావడం దారుణం అన్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు కోసం కాంగ్రెస్ ఉద్యమం ఆగబోదన్నారు.

బీహార్ ఓటర్లను కుట్రకు బలి కానివ్వం
సాసారం: కేంద్ర ఎన్నికల సంఘం అధికార బిజెపితో కుమ్మక్కు అయ్యి ఎన్నికలచౌర్యానికి పాల్పడుతోంది. ఈ విషయం మొత్తం దేశానికి తెలిసిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను హైజాక్ చేసేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకుని తీరుతామని ఆయన తెలిపారు. సర్ ప్రక్రియపై తీవ్ర స్థాయిలో దాడికి దిగిన రాహుల్ , నిజమైన ఓటర్ల హక్కును కాపాడేందుకు ఉద్యమించామని వివరించారు. బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర పేరిట రాహుల్ 1300 కిలోమీటర్ల యాత్ర ఆరంభం అయింది. సాసారంలో ఆయన ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల చౌర్యం ద్వారా ఎన్నికల సంఘం ప్రజా తీర్పును దారి మళ్లించిందని ఆరోపించారు. ఇప్పుడు బీహార్‌పై కూడా ఇదే విధంగా కన్నేశారు. ఈ కుట్రను తమ పార్టీ సాగనివ్వదని, ఓటు భద్రం నినాదంతో ప్రజల వద్దకు వెళ్లుతున్నానని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ తెలిపారు. ఓట్లచోరీకి ఆధారాలు చూపాలని, ఆరోపణలతో అఫిడవిట్ ఇవ్వాలని ఎన్నికల సంఘం తనను ఆదేశించిందని గుర్తు చేశారు. ఓడినప్పుడు బిజెపి నేతలు ఓట్ల అక్రమాలు జరిగాయని చెపితే

వారి పట్ల ఎన్నికల సంఘం మౌనంగా ఉందని విమర్శించారు. బీహార్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సి ఉంది. ఇందుకు ప్రజల మద్దతు కూడగట్టుకుని ముందుకు వెళ్లుతామని, ఇప్పటి యాత్ర ఇందుకోసమే అని రాహుల్ చెప్పారు. దేశ ప్రజలు అనేకం కోల్పోయి ఇప్పుడు ఓటు అధికారంతో ఉన్నారు. చివరికి పేదల ఈ పవర్‌ను కూడా లాక్కునేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఓట్ల అక్రమాల విషయం ప్రజలందరికీ తెలుసు. ఇకపై బీహార్, బెంగాల్ , మహారాష్ట్ర , అసోం ఎక్కడైనా ఎటువంటి స్థాయిలో ఓట్ల చౌర్యం జరిగినా తాము పట్టుకుని , ప్రజల ముందుకు ఈ చర్య గురించి తెలియచేస్తామని చెప్పారు. ప్రధాని మోడీ సామాన్యుడి ఓటును లాక్కుంటున్నాడు. వారి డబ్బును తాను ఎంచుకున్న 56 మంది అత్యంత సంపన్నులకు కట్బబెట్టాడని, , ఈ ప్రభుత్వం బిలియనీర్లతోనే నడుస్తోందని దాడికి దిగారు. రాజ్యాంగ పరిరక్షణకు సాగేదే తమ ఉద్యమం అన్నారు. ఈ యాత్ర ప్రారంభ దశలోనే కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగించారు. బిజెపి అధికారం సాగినంత కాలం ప్రజల హక్కులకు రక్షణ లేదన్నారు. రాజ్యాంగానికి అన్ని విధాలుగా ముప్పు పొంచి ఉందని విమర్శించారు. యాత్రలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఇతరులు పాల్గొన్నారు.

ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి బయటపడింది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ 7 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేయడం ఈసీఐ స్పష్టమైన పక్షపాత ధోరణికి అద్దం పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ సోషల్ వీడియా వేదిక ఎక్స్ లో ఒక పోస్ట్ వేశారు. ఆదివారం నాడు భారత ఎన్నికల కమిషన్ విలేకరుల సమావేశం నిర్వహించిందని ఈ కొత్త ఈసిఐ తొలిసారిగా ఎన్నికల ఏర్పాట్ల గురించి కాక ప్రతిపక్ష నేతను విమర్శించేందుకు మాట్లాడడం ఇదే ప్రథమం అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలకు తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం నిర్వహించిందని,, ఆరోపణలపై ఆధారాలతో కూడిన అఫిడవిట్ సమర్పించేందుకు రాహుల్ కు ఏడు రోజుల గడువు ఇచ్చిందని, లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. అఫిడవిట్ సమర్పించని పక్షంలో ఆ ఆరోపణలన్నీ అబద్ధాలని భావిస్తామని కూడా ఈసీఐ పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు.

అఫిడవిట్ ఇవ్వాలి లేదా దేశానికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మూడో మార్గం లేదు అని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణల బాధ్యతను రాజకీయ పార్టీలు, వ్యక్తులపై నెట్టివేస్తూ ఈసీఐ ఓ ప్రెస్ నోట్ విడుదల చేయడంతో అసలు వివాదం మొదలైందని జైరాం రమేశ్ అన్నారు. ఈ నోట్ పై ప్రతిపక్ష పార్టీల నుంచి, ప్రజలనుంచి విసృ్తత విమర్శలు ఎదురయ్యాయని ఆయన అన్నారు.ఒక పక్క రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి బీహార్ లోని ససారాం లో ఓటర్ అధికార్ యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఎన్నికల కమిషన్ అల్టిమేటం జారీ చేయడాన్ని జైరాంమ్ తప్పుపట్టారు. ఇది హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఏ ప్రశ్నకూ ప్రధాన ఎన్నికల కమిషనర్ అర్థవంతంగా సమాధానం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును పాటించడమే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ముందు గల ఏకైక సమస్య అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. 2025 ఆగస్టు 14న సుప్రీంకోర్టు బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఆదేశాలు జారీచేస్తూ తొలగించిన లక్షలాదిమంది పేర్లు సమర్పించాలని కోరిందని, అది ఈసీఐ అక్షరాలా ఆమలు చేస్తుందా అని కాంగ్రెస్ నేత నిలదీశారు. రాజ్యాంగ బద్ధంగా కమిషన్ దానిని పాటించాలి దేశప్రజలు దీనికోసం వేచిఉన్నారని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News