మూడు నెలల క్రితం భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. 90 రోజుల విరామం తర్వాత అది అమలు లోకి రాకుండా ఉండేందుకు వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని రాహుల్ పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోడీ తలొగ్గుతారని , తన మాటలు నమ్మకపోతే రాసి పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.
అమెరికా పరస్పర సుంకాల సస్పెన్షన్ జులై 9 న ముగియనున్నందున ఆ గడువుకు ముందే చర్చలు పూర్తి చేయాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ పటిష్ఠ విధానాలను కలిగి ఉందని స్పష్టం చేశారు. గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు దేశం ఎప్పుడూ తొందరపడదని అన్నారు. రెండు వర్గాలకు లాభదాయకంగా ఉంటేనే అంగీకరిస్తుందన్నారు.