లోకసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో జరుగుతున్న ఎన్నికలతంతు మీద వెలికి తీస్తున్న వాస్తవాలు, వాటి ఆధారంగా ఆయన చేస్తున్న పోరాటం భారత ఎన్నికల సంఘం విశ్వసనీయతను రోజురోజుకూ ప్రశ్నార్థకం చేస్తున్నది. ఓటర్ల జాబితాలలో అవకతవకల దగ్గర నుండి, ఈవీఎంల దుర్వినియోగం వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఇండియా కూటమిలోని ఇతర పార్టీల నాయకులు పద్ధతి ప్రకారం వాస్తవాలను వెలికి తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేయడమే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య సంఘటన (ఎన్ డిఏ) మీద కూడా నీలినీడలు పరుస్తున్నది. ఓటర్ల జాబితాలు సక్రమంగా ఉండి, ఈవీఎంల దుర్వినియోగం జరగకపోయి ఉంటే భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు కనీసం మరో 70 లోకసభ స్థానాలు కోల్పోయి ఉండేవి అన్న వాదనకు రాహుల్ గాంధీ, తదితరులు బయటపెడుతున్న వాస్తవాలు బలం చేకూరుస్తున్నాయి. ఈ అంశం మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఇతరత్రా అభిప్రాయ భేదాలు ఉన్నా ఈ విషయంలో మాత్రం ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి గొడుగు కిందకు రావడం విశేషం.
గతంలో మహారాష్ట్ర, మరికొన్ని ఇతర రాష్ట్రాలలో జరిగిన అవకతవకల గురించి, లోకసభ ఎన్నికల్లో జరిగిన అవకతవకల గురించి రాహుల్ గాంధీ బృందం బోలెడు వివరాలు బయట పెడుతోంది. ప్రస్తుతం జరగబోతున్న బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్దయెత్తున అవకతవకలు జరిగినట్టుగా ప్రతిపక్షాలు ఆధారాలతో కూడిన వివరాలు బయట పెడుతున్నాయి. రాజకీయపక్షాలే కాకుండా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్- ఏడిఆర్) వంటి స్వచ్ఛంద సంస్థలు కూడా బీహార్లో ఓటర్ల జాబితాలకు సంబంధించి జరిగిన అవకతవకలను బయటపెట్టాయి. ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలోంచి 65 లక్షలమంది పేర్లు తాజాగా తొలగించారు. అందులో 22 నుంచి 25 లక్షలమంది మరణించారని, మరో 37 లక్షలమంది రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లారనేది ఎన్నికల సంఘం చెబుతున్న మాట. ఆరు మాసాల కాలంలో 25 లక్షల మంది చనిపోవడం అనేది నమ్మశక్యంగా లేదు. ఈ స్వల్పకాలంలో మరో ముప్పై ఏడు లక్షల మంది రాష్ట్రం విడిచి వెళ్లిపోయి ఉంటారా అని ఏడిఆర్ వంటి సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది వ్యవహారం. ఎన్నికల సంఘం చనిపోయారని తేల్చి పేర్లు తీసేసిన కొందరు ఓటర్లను యోగేంద్ర యాదవ్ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.
రాహుల్ గాంధీ అయితే ఆ ‘చనిపోయిన’ (జాబితాలో ఉన్న) వారిలో కొద్దిమందితో తాను టీ తాగినట్లు కూడా చెప్పారు. అంతకుముందు మహారాష్ట్రలో 40 లక్షల ఓట్లను కొత్తగా చేర్చారు. మహారాష్ట్రలో కొత్త ఓటర్లను చేర్చిన ప్రక్రియ ఎప్పుడు జరిగింది? 2024 మే నెలలో లోకసభ ఎన్నికలు జరిగిన తర్వాత కేవలం అయిదు మాసాలకే నవంబర్ నెలలో శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉండగా. ఈ స్వల్ప వ్యవధిలో ఇన్ని లక్షల కొత్త ఓటర్లను చేర్చేశారు. ఇటు మహారాష్ట్రలో అయిదారు మాసాల కాలంలోనే 40 లక్షల కొత్త ఓటర్లు చేరిపోతారు. బీహార్లో స్వల్ప వ్యవధిలోనే 65 లక్షల ఓట్లు జాబితాలోంచి ఎగిరిపోతాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇంకా రకరకాల అవకతవకలు బయటకు వస్తున్నాయి. వీటన్నిటి నుండి బయటపడి కేంద్ర ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిన మాట వాస్తవం.
రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ పేరుతో చేస్తున్న ఈ పోరాటం ఢిల్లీ పార్లమెంట్ వీధుల్లో పెద్దయెత్తున సాగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మూల కడప జిల్లాలో రెండు జెడ్ పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పులివెందుల రూరల్, ఒంటిమిట్ట అనే ఈ రెండు స్థానాలు అక్కడ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించినవి.
పులివెందుల జడ్పిటిసి సభ్యుడు ఒక ప్రమాదంలో మరణిస్తే, అదే జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఉండిన ఒంటిమిట్ట జడ్పిటిసి సభ్యుడు శాసనసభకు ఎన్నికైతే ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇవేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 20, 30 స్థానాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. వాటన్నిటికీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు స్థానాలకు మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నది. ఖాళీలు ఏర్పడినప్పుడు ఉప ఎన్నికలు జరగడం సర్వసాధారణం. చాలావరకు ఉప ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అధికార పక్షానికి అనుకూలంగా ఉండడం కూడా సహజం. అదేవిధంగా ఈ రెండు జెడ్పిటిసి స్థానాలు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ కైవసం అయ్యాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి ఉంటే ఎవరికీ పేచీ ఉండనక్కరలేదు. ఎన్నికల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చేసిన ప్రకటనలు విడ్డూరంగా ఉన్నాయి. కడప జిల్లా డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కాలం నుండి ఆయన కుటుంబం కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉన్నదని, దానిని ఇప్పటికి విముక్తం చేయగలిగామని తండ్రి కొడుకులు హర్షం ప్రకటించారు.
కడప జిల్లా మొదటినుండీ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న మాట వాస్తవం. 1978లో తొలిసారి శాసనసభకు ఎన్నిక అయిన నాటినుండి మరణించేవరకూ రాజశేఖరరెడ్డి ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. ఆయనే కాదు, ఆయన సతీమణి విజయలక్ష్మి, సోదరుడు వివేకానందరెడ్డి, కుమారుడు జగన్ మోహన్ రెడ్డి, తమ్ముడి కుమారుడు అవినాష్ రెడ్డి పులివెందుల శాసనసభాస్థానం నుండి, కడప లోకసభ స్థానం నుండి వరుసగా గెలుస్తూనే వచ్చారు. ఆ కుటుంబానికి కడప జిల్లా ప్రజల మనస్సులో ఉన్న అభిమానం అటువంటిది. 2004లో రాజశేఖరరెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యేవరకూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని సందర్భాలలో ఆయన వ్యతిరేకులే ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు. ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడుల నాయకత్వంలో రెండు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. అ మొత్తం కాలంలో కూడా కడప జిల్లాలో రాజశేఖరరెడ్డి కుటుంబం అప్రతిహతంగా విజయాలు సాధించింది. అప్పుడెందుకు ఈ మాటలు చంద్రబాబు నాయుడు గానీ, ఆయన పార్టీ వారు కానీ మాట్లాడలేదు? ఏ రాజకీయ అండా లేకుండా కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ ఒక్కటయి తన మీద పగ పట్టిననాడు, తండ్రిని కోల్పోయిన కొద్దికాలానికే జగన్ మోహన్ రెడ్డి కడప లోకసభ నుండి స్వతంత్ర అభ్యర్ధి గా పోటీచేసి ఆ రెండు పార్టీల అభ్యర్ధులను మట్టి కరిపించిన విషయం తెలిసిందే.
ఆ కుటుంబానికి జిల్లాలో ఉన్న ఈ ప్రజాదరణను చంద్ర బాబునాయుడు తదితర ప్రత్యర్ధులు కబంధ హస్తాల్లో ఇరుక్కోవడంగానే భావిస్తారని అనుకుందాం పోనీ. ఆ జిల్లాలో అంతా అప్రజాస్వామ్య పద్ధతుల్లో సాగుతుందని అనుకుంటే అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు ఏం చెయ్యాలి? అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించి ఆదర్శంగా నిలవాల్సింది. జరిగిందేమిటో మీడియాలో ప్రత్యక్షంగా చూసాం, సామాజిక వేదికల మీద చూసాం, విన్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పత్రికా గోష్ఠి నిర్వహించి ఆధారాలతో సహా పులివెందుల, ఒంటిమిట్ట జడ్ పీటీసి ఉప ఎన్నికలు ఎంత అప్రజాస్వామికంగా, దౌర్జన్యపూరితంగా, హింసాత్మకంగా జరిగాయో చూపించారు. పోటీలో ఉన్న అభ్యర్ధులను, వారి ఏజెంట్లను, చివరికి ఓటర్లను కూడా బెదిరించి, ఇళ్ళలో బంధించి బయటినుండి తోలిన మూకల చేత దొంగ ఓట్లు వేయించుకుని, ఆ నిర్వాకమంతా పోలీసుల పర్యవేక్షణలో జరిపించి గెలవడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య పునరుద్దరణ అనడం హాస్యాస్పదంగా ఉంటుంది.
175 శాసనసభ స్థానాలకుగాను 164 స్థానాలు కూటమి గెలుచుకుని చారిత్రక విజయం సాధించిన చంద్రబాబు నాయుడుకు రెండు జడ్ పీటీసి స్థానాల ఉప ఎన్నిక.. అందునా మరో తొమ్మిది నెలల్లో కాలపరిమితి ముగియనున్న సమయంలో ఇంత అపఖ్యాతి మూట కట్టుకోవాల్సిన అవసరం ఉందా? కడప జిల్లాలో తాజాగా జరిగిన తంతు చూస్తే 2017లో చంద్ర బాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నంద్యాల ఉపఎన్నిక గుర్తొస్తుంది ఎవరికయినా. అప్పుడు నంద్యాలలో అయినా ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్టలలో అయినా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం మీదా, ప్రజల మీదా నమ్మకం లేదన్న విషయం స్పష్టం అవుతుంది. ఇక రాహుల్ గాంధీ విషయానికొస్తే ఇంత పెద్దయెత్తున ఎన్నికల అవకతవకల మీద ఆందోళనకు నడుం గట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు నోరు విప్పడం లేదు? ఆయనే కాదు, ఆయన పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలగాని, ఆంధ్రప్రదేశ్ లో ఆయన పార్టీ ఇంచార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ గాని తమ పార్టీకి అత్యంత ప్రధాన ప్రత్యర్థి అయిన ఎన్ డిఏ కూటమి నాయకత్వంలో జరుగుతున్నఈ నిర్వాకాల గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నదని మరిచిపోయారు.
మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల అవకతవకలు, బీహార్ లో జరగబోతున్న తంతు మీద మాట్లాడుతున్నారే కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘోరమైన ఎన్నికల తప్పిదం గురించి ఆయన పల్లెత్తు మాట మాట్లాడకపోవడం చూస్తే జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడుతో ఆయన రహస్య స్నేహం కొనసాగిస్తున్నారని అనుమానం కలగక మానదు. ఆంధ్రప్రదేశ్ లో అడుగంటిపోయిన కాంగ్రెస్ ప్రతిష్ఠను మళ్లీ పొందాలనుకుంటే ఆ రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ఎన్నికల అక్రమాల కారణంగా జరిగిన నష్టాన్ని గురించి రాహుల్ గాంధీ మాట్లాడాలి. పాత స్నేహితుడైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కాంగ్రెస్ బద్ధ శత్రువు అయిన బిజెపికి అత్యంత సన్నిహిత మిత్రుడు.ఇదిలాఉంటే రాహుల్ గాంధీ, చంద్రబాబు మధ్య స్నేహం ఉందని చెప్పి జగన్ మోహన్ రెడ్డి పత్రికా గోష్ఠిలో చేసిన వ్యాఖ్యకు స్పందనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ జగన్ కి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ర్యాలీకి మద్దతు ఇవ్వాలని అనడం హాస్యాస్పదం. రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రలో కాంగ్రెస్ నిర్వహించనున్న ర్యాలీలో ఆ రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల అవకతవకల గురించీ, మొన్న కడప జిల్లాలో జెడ్ పీటీసిలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం చేసిన నిర్వాకాన్ని గురించి కూడా నిరసన తెలుపుతారా మరి.
జగన్ మద్దతు కోరే అర్హత కాంగ్రెస్ ఎప్పుడో కోల్పోయింది. 2004లో ఒంటిచేత్తో కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చి, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధాన కారకుడైన రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే లోకసభ వేదిక మీద చంద్రబాబునాయుడు గొప్ప దార్శనికుడని కొనియాడినవాడు రాహుల్ గాంధీ. 2004, 2009లో రెండుసార్లు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి డాక్టర్ రాజశేఖరరెడ్డి ఎంత దోహదం చేశారో అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ స్వయంగా చెబుతూ ఉండేవారు. రాజశేఖర రెడ్డిని చూడగానే ఆయన ‘డాక్టర్, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను’ అని అనేవారని ప్రధానమంత్రి దగ్గర మీడియా సలహాదారుగా పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు సంజయ్ బారు పలు సందర్భాల్లో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
ఈవీఎంల మీద సందేహాలున్నాయని మొట్టమొదట నిరసన స్వరం వినిపించిందీ, న్యాయ పోరాటం ప్రారంభించిందీ జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీయే. ఆయన అక్కడికే పరిమితం కావడంతో నేడు ఆ అవకాశం రాహుల్ గాంధీ కి దక్కినట్టు అయింది. ఈ అంశం మీద జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెసేతర, బీజేపీయేతర రాజకీయ పక్షాలను కలుపుకుని జాతీయ స్థాయిలో ఉద్యమం చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆయనకు ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర బలగాల మీద నమ్మకం ఉన్నట్టుంది. అందుకే తాజా పత్రికా గోష్ఠిలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉప ఎన్నికలు మళ్ళీ నిర్వహించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి తాము సమర్పించిన విజ్ఞప్తుల పట్ల సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. ఆ వ్యవస్థలన్నీ రాజకీయాల రంగుల డబ్బాలో మునిగి సప్తవర్ణాలు సంతరించుకున్న విషయం ఆయనకు తెలియదనుకుందామా?