ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే దేశ రాజకీయాల్లోకి దూసుకెళుతున్నారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఒక దశలో శభాష్ అంటూ సిఎం రేవంత్‌ను ప్రశంసించారు. మొన్నటి వరకూ బిసి రిజర్వేషన్ల బిల్లు, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి పదవికి ‘ఇండి’ కూటమి అభ్యర్థి కావడం గమనార్హం. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పాన్ని చూసి రాహుల్ ముగ్దుడయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడమే కాకుండా ఆ తర్వాత మంత్రివర్గం ముసాయిదా ఆర్డినెన్స్‌ను గవర్నర్ ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించడం జరిగింది. అంతేకాకుండా బిసి రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం, దీనికి ప్రత్యేక రైలు ద్వారా కార్యకర్తలను తీసుకుని రావడం పట్ల కూడా అధిష్టానం సంతోషంగా ఉందని తెలిసింది.
ఇదిలాఉండగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలోనూ రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు న్యాయకోవిధుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి పెడితే బాగుంటుందని అధిష్టానం దృష్టికి తెచ్చినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి రాధాకృష్ణన్ ఎన్డీయే అభ్యర్థిగా ఉంటే తెలంగాణ నుంచి ‘ఇండి’ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి పెట్టాలని సూచించారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన అభ్యర్థి పట్ల పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందించింది. దీంతో ముఖ్యమంత్రి సోమవారం జస్టిస్ సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఈ నెల 21న (గురువారం) జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఆంధ్రకూ ఆదర్శం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మరి కొన్ని పథకాలూ ఇతర రాష్ట్రాలకూ ఆదర్శనంగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో, స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమూ ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతు భరోసా వంటి పథకాలనూ ఇతర రాష్ట్రాలూ పరిశీలిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవ పట్ల కాంగ్రెస్ అధిష్టానం సంతోషంగా ఉందని తెలిసింది.