న్యూఢిల్లీ: రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై ఢిల్లీలో ప్రజెంటేషన్ నిర్వహించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వేపై ఇచ్చిన ప్రజెంటేషన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్నారు. ఒబిసి రిజర్వేషన్ల వ్యవహారం, రాష్ట్రం ఆమోదించి పంపించిన బిల్లుపై ఈ సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కులగణన సర్వే నిర్వహించడం అంత తేలిక కాదు అని తెలంగాణలో రేవంత్ రెడ్డి విజయవంతంగా కులగణన చేపట్టారని అన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని ప్రశంసించారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
‘‘ఆఫీసు రూముల్లో కూర్చొని కులగణన చేస్తే మంచి ఫలితాలు రావు. తెలంగాణ కులగణనలో దాదాపు 56 ప్రశ్నలు అడిగారు. దేశంలో నిర్వహించే కులగణనకు ఇది మార్గదర్శిగా నిలుస్తుంది. సరైన డేటా చేతిలో ఉంటేనే ఏదైనా చేయగలం. ఇప్పుడు తెలంగాణ చేతిలో సరైన డేటా ఉంది. వీధిస్థాయి వరకూ డేటా ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇండియాలో తెలంగాణకు ఉన్న స్థాయిలో డేటా మరే రాష్ట్రంలోనూ లేదు. ధనం, భూమి ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలిపే డేటా తెలంగాణలో ఉంది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాల్సిన అవసరం ఉంది. అది పూర్తిగా బిజెపి భావజాలం. కులగణనను సరైన రీతిలో బిజెపి సర్కారు చేయదు. దేశ అసలైన వాస్తవ చిత్రాన్ని బహిర్గతం చేయడానికి బిజెపి ఇష్టపడదు’’ అని రాహుల్ (Rahul Gandhi) అన్నారు.