Sunday, May 4, 2025

పార్టీ తప్పిదాలకు నాది బాధ్యత

- Advertisement -
- Advertisement -

1984లో సిక్కులపై దాడుల ఉదంతం
కాంగ్రెస్ ఎంపి రాహుల్ వెల్లడి
ఇప్పుడు సిక్కు సమాజంతో సయోధ్య

న్యూఢిల్లీ : గతంలో వివిధ దశల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక తప్పిదాలతో తనకు సంబంధం లేదని పార్టీ నేత , ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు. తప్పులు దొర్లాయి. తాను ఇవి జరిగినప్పుడు ఏ హోదాలోనూ పార్టీలో లేనని, అయితే పార్టీ నేతగా ఇప్పుడు ఈ తప్పిదాలకు తాను బాధ్యత తీసుకుంటానని ఆయన చెప్పారు. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన దాడుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అప్పటి ఉదంతం తరువాత కాంగ్రెస్ పార్టీకి సిక్కు సమాజానికి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. జరిగింది తప్పేనని రాహుల్ దాదాపుగా చెంపలేసుకున్నంత పనిచేశారు.

గత నెల చివరిలో అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ సంబంధిత వాట్సన్ విభాగం ఆధ్వర్యంలో సిక్కుసోదరులతో ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సంబంధిత ఇష్టాగోష్టి వీడియో యూట్యూబ్‌లో విడుదల అయింది.పార్టీకి ఘన చరిత్ర ఉంది అయితే జరిగిన తప్పులకు ఇప్పుడు బాధ్యత వహించడం కూడా తనకు సంతోషం కల్గిస్తోందని వివరించారు. కేవలం సారీ చెప్పడం కాదు, ఇకపై ఇటువంటివి జరగకుండా చూడటం తన కర్తవ్యం అన్నారు. ఇప్పుడు సిక్కు సామాజిక వర్గంతో కాంగ్రెస్ సయోధ్యకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అని సిక్కు సోదరుడు ఒక్కరు రాహుల్‌ను ఈ సందర్భంగా నిలదీశారు.

పార్టీకి సంబంధించి 1984 ఘటనలు మాయని మచ్చలే అని అంగీకరిస్తున్నారా? అని కూడా ప్రశ్నించారు. దీనికి రాహుల్ అవునని వినయంగా బదులిచ్చారు. తలపాగాల విషయం, సిక్కుల ఇతర సమస్యల గురించి కూడా చర్చాగోష్టిలో ప్రస్తావన వచ్చింది. సిక్కులు కానీ ఇతర మతస్థులు కానీ తమ మతాచారాల పాటింపు విషయంలో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా ఉండాలి.ఈ విధంగా చేయాల్సిన గురుతర బాధ్యత అధికార యంత్రాంగం , శాసించే పాలక పక్షంపై ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. అయితే ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. తనకు సంబంధించి తమ పార్టీ ద్వారా అనూహ్య పరిస్థితుల్లో జరిగిన తప్పిదాలపై బాధ్యత తీసుకోవడం, ఇక ముందు ఇటువంటివి జరగకుండా చూడటం అని రాహుల్ బదులిచ్చారు. తాను పలుసార్లు సిక్కుల పవిత్ర మత స్థలి అమృత్‌సర్ స్వర్ణ దేవాలయానికి వెళ్లానని, అక్కడి పెద్దల ఆశీస్సులు తీసుకున్నానని వారితో ఇప్పుడు తనకు పార్టీకి సాదర సహోదర బంధం ఉందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News