న్యూఢిల్లీ : గత పదేళ్లుగా తన బావ రాబర్ట్ వాద్రాను కేంద్ర ప్రభుత్వం వెంటాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఓ భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన కేసులో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే శుక్రవారం రాహుల్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ఈ తాజా ఛార్జిషీటు కూడా ఆ కోవకు చెందినదేనని విమర్శించారు. దురుద్దేశంతో రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్ వాద్రా, ప్రియాంకల కుటుంబానికి తాను అండగా ఉంటానని రాహుల్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వీటిని తట్టుకునే ధైర్యం వారందరికీ ఉందని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. వాద్రా సంస్థ స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఆయనతో సంబంధం ఉన్న సత్యానంద్ యాజీ, కేవల్ సింగ్‌లను వారి సంస్థ ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ సహా మొత్తం 11 సంస్థల షేర్లను ఛార్జిషీట్‌లో ఈడీ చేర్చింది. వాద్రాకు చెందిన రూ. 37.64 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను దర్యాప్తు సంస్థ జప్తు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.