మన తెలంగాణ/హైదరాబాద్ :డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కొనకుండా ఉండేందుకు తెలంగాణలో ‘రోహిత్ వేముల’ చ ట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్ ఉన్న యువకులు కుల వివక్ష కారణంగా అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో ఆయన తెలిపారు. తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని సిఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఈ లేఖలో కోరారు. అయితే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన జీవితంలో ఎదుర్కొన అనుభవాల గురించి కూడా రాహుల్‌గాంధీ ఈ లేఖలో ప్రస్తావించారు. ‘మా దగ్గర పుష్కలంగా ఆహారం ఉంది. మాలో ఆకలి మండుతోంది.
ఇవన్నీ ఉన్నప్పటికీ మేము ఆహారం లేకుండా నిద్రపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు నీరు లభించలేదు. మేము అంటరానివాళ్లం కాబట్టి మాకు నీరు లభించలేద’ని అంబేద్కర్ తన అనుభవాలను చెప్పారని రాహుల్ ఈ లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు అంబేద్కర్ పాఠశాలలో తాను స్వయంగా ఎదుర్కొన్న అనుభవాన్ని కూడా రాహుల్‌గాంధీ ఈ లేఖలో ప్రస్తావించారు. ‘నేను అంటరానివాడిని అని నాకు తెలుసు. అంటరానివారు కొన్ని అవమానాలు, వివక్షలకు గురయ్యారని నాకు తెలుసు. పాఠశాలలో నా ర్యాంకు ప్రకారం నా క్లాస్‌మేట్ మధ్యలో కూర్చోలేను. కానీ, నేను ఒక మూలలో ఒంటరిగా కూర్చోవాలని నాకు తెలుసు’ అని అంబేద్కర్ చెప్పిన మాటలను ఉదాహరించారు. అంబేద్కర్ ఎదుర్కొన్న అవమానాలు సిగ్గుచేటు అని రాహుల్‌గాంధీ ఈ లేఖలో పేర్కొన్నారు. భారతదేశంలోని ఏ బిడ్డకు ఇలాంటి అవమానాలు ఎదురుకాకూడదని, వారు భరించకూడదని ఈ లేఖలో రాహుల్‌గాంధీ ప్రస్తావించారు.
ఈ వివక్షను ఎదుర్కొవాల్సి రావడం సిగ్గుచేటు
నేటికీ, మన విద్యా వ్యవస్థలో దళిత, ఆదివాసీ, ఓబిసి వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇంత క్రూరమైన వివక్షను ఎదుర్కొవాల్సి రావడం సిగ్గుచేటని రాహుల్ గాంధీ ఈ లేఖలో పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది పౌరులు, ఇతరులు అనుభవించిన సంఘటనలను భారతదేశంలోని ఏ బిడ్డ కూడా ఎదుర్కొవాల్సిన అవసరం లేకుండా రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేయాలని తాను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని రాహుల్ గాంధీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా రాహుల్‌గాంధీ ఈ లేఖను విడుదల చేశారు. కర్ణాటక సిఎం సిద్ధరామయ్యకి లేఖ రాసిన తర్వాత, తను హిమాచల్ ప్రదేశ్ సిఎం సుఖ్‌విందర్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘రోహిత్ వేముల చట్టం’ అమలు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్లు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.