హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రాజెక్టులలో హను రాఘవపూడితో చేస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమా ‘ఫౌజీ’ (Fauji) అనే టైటిల్‌తో ప్రచారంలో ఉంది. సోషల్‌మీడియా స్టార్ ఇమాన్వీ ఇస్మాయిల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రభాస్ సరసన నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన లుక్ గురించి ప్రశ్నించగా.. ‘‘హను రాఘవపూడి సినిమాలో నటిస్తున్నాను.. అందుకోసమే ఈ లుక్ కొనసాగిస్తున్నా’’ అని చెప్పారు. దీంతో ప్రభాస్ సినిమాలో రాహుల్ (Rahul Ravindran) నటిస్తున్నారని స్పష్టమైంది. ఇక ఫౌజీ (Fauji) విషయానికొస్తే.. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. 1940వ దశకంలో మాతృభూమి కోసం పోరాటం చేసే యోధుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి దర్శకుడు హను రాఘవపూడి ఈ కథను సిద్ధం చేశారు.