మన తెలంగాణ/హైదరాబాద్ :ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గురువారంనాడు హైదరాబాద్‌లో రోజంతా ముసురు పట్టింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం కాగా, మరో రెండు రోజుల పాటు వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆరు జిల్లాల్లో లోటు వర్షపాతమే
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా ఇప్పటికి ఆరు జిల్లాలో లోటు వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెపుతున్నాయి.జూన్ 1వ తేదీ నుంచి గురువారం (జూలై 24వ తేదీ) వరకు నమోదైన వర్షపాత గణాంకాల్లో రాష్ట్రంలోని మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జనగాం జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సాధారణం కంటే స్వల్పంగా అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.