Tuesday, May 13, 2025

తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. వేసవి ఎండలతో పడుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం కలగనుందని తెలిపింది. రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన దట్టమైన ఈదురుగాలులతో భారీ వర్షం పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి.

నేడు అండమాన్‌ను తాకనున్న నైరుతి రుతుపవనాలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ కంటే నాలుగు రోజులు ముందుగానే కేరళ తీరాన్ని తాకనున్నాయని ఐఎండి పేర్కొంది. మే 13వ తేదీన అండమాన్ ప్రాంతాన్ని చేరుకుంటాయని, మే 27 నాటికి కేరళకు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాది మే 31వ తేదీన రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని ఐఎండి అంచనా వేసినా, ఒక రోజు ముందుగానే వచ్చాయి. ఈ సారి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కంటే సగటున 105 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, దేశాన్ని ప్రభావితం చేసే ఎల్‌నినో పరిస్ధితులు తొలగిపోయాయని భారత వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం తెలుస్తోంది.

దీని ప్రభావంతో గత ఏడాది సీజన్ ఆలస్యంగా మెదలుకావడంతో పాటు సాధారణ రోజుల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు వాతావరణ తారతమ్యం తగ్గిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఈశాన్య భాగంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా పెరిగే ఒక ప్రకృతితత్వం. ఇది ప్రపంచ వాతావరణ నమూనాలను ప్రభావితం చేసే శక్తివంతమైన ఘటన, దీని వల్ల ముఖ్యంగా భారత్‌లో, ఇతర ఆసియా దేశాల్లో వర్షాలపై ఉష్ణోగ్రతలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని ఐఎండి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News