హైదరాబాద్‌లో రెండో రోజూ
దంచికొట్టిన వాన పలు
ప్రాంతాలు జలమయం
భారీగా ట్రాఫిక్‌జామ్‌లు
బంగాళాఖాతంలో ద్రోణి
మరో మూడురోజులు వర్షాలు
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
మన తెలంగాణ/సిటీబ్యూరో : వరణుడు మరోమారు కన్నెర్ర చేశాడు. శుక్రవారం కురిసిన భా రీ వర్షానికి నగరం చేరుకోకముందే…రెండోరో జూ దంచికొట్టింది. శనివారం సాయంత్రం కురిసిన భారీవర్షానికి నగరం వణికింది. నగరంలో ని పలుప్రాంతాల్లోని అనేక కాలనీలు పూర్తి జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీ వ్ర అంతరాయం ఏర్పడింది. తద్వారా నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్, గంపేట్,తార్నాక,ఉప్పల్,జవహార్‌నగర్,కుత్బుల్లాపూర్,మియాపూర్,కూకట్‌పల్లి,అమీర్‌పేట్,పంజాగుట్ట,జూబ్లీహిల్స్,బంజారాహిల్స్,గచ్చిబౌలి,మాదాపూర్,శేరిలింగంపల్లి, కోఠి,బషీర్‌బాగ్,ముషీరాబాద్, తదితర ప్రాంతా ల్లో భారీ వర్షం కురియడంతో రహదారులు వరదకాలువల్లా మారాయి.
గచ్చిబౌలి,మాదాపూర్, హైటెక్‌సిటీ,సికింద్రాబాద్,కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జాం కావడంతో వా హనదారుల అవస్థలు వర్ణనాతీతం. ప్యాట్నీసెంటర్ వద్ద నాలాపైనుంచి వరదనీరు పొంగిపొర్లడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసివచ్చింది. జవహార్‌నగర్‌లో అనేక లోతట్టుప్రాంతా లు జలమయమయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ ప రిధిలోని బాటసింగారంలో కురిసిన భారీ వర్షానికి సర్వీసురోడ్డుపై వరదనీరు భారీగా చేరడంతో తీవ్ర ఇబ్బందులను ఎదర్కొనవలసివచ్చింది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికే నగరం అతలాకులం కాగా, శనివారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకుల వణికింది. పలు ప్రాంతాల్లో హైడ్రా,జిహెచ్‌ఎంసి అధికారులు రంగంలోకి వరదనీటిని తొలగించడంతో కొంత సమస్య పరిష్కారం అయ్యింది.
అప్రమత్తంగా ఉండండిః జిహెచ్‌ఎంసి కమిషనర్
భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు ఇబ్బందులు పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జోనల్ కమిషనర్‌లు,హెచ్‌ఓడిలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. హైడ్రా,ట్రాఫిక్,పోలీసు,విద్యుత్‌శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి వాటర్ లాగింగ్ పాయింట్లు, వరద ముంపు లేకుండా చూడాలని ఆదేశించారు.
మరో మూడు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో ద్రోణి ప్రబావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటుగా సోమవారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి,
మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ఇచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, శనివారం అత్యధికంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట ప్రాంతాల్లో 104.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.