మన తెలంగాణ/బాసర: బాసర సరస్వతి క్షేత్రం ఆలయ ఆవరణలో పైకప్పు పూర్తి స్థాయిలో వేయకపోవడంతో మూడు రోజులు కురుస్తున్న వర్షానికి నీరు చేరుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం చుట్టూ ఉన్న స్లాబ్ శిథిలావస్థకు చేరింది. లీకేజీ అవుతోంది. బాసర సరస్వతి అమ్మవారికి కొత్త కష్టం ఎదురవుతోంది. చిన్నపాటి వర్షానికి ప్రధాన ఆలయ మండపం ఊరుస్తోంది. పై నుంచి లికేజీ అయ్యి నీరు పడుతుంటే మరోవైపు భక్తులు అమ్మవారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కనీసం మరమ్మతులు కూడా అధికారులు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంతేగాకాదు. ప్రాకార మండపం కూడా శిథిలావస్థకు చేరింది. చాలా చోట్ల వర్షం కురిస్తే ఊరుస్తోంది.
బాసర నిలయం సమస్యల క్షేత్రంగా మారింది. గంట సేపటి వర్షానికి బాసర ఆలయంలో చేరిన వర్షం నీళ్లతో భక్తులకు ఇబ్బందిగా మారింది. నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చే అమ్మవారి ఆలయంలో సౌకర్యాలు కరువయ్యాయి. ఆలయం గర్భగుడి నుంచి నీటి బొట్టులు రాలుతుండగా ప్రాంగణంలోని మండపాలు కొంత శిథిలావస్థకు చేరడంతో వాన నీరు లీకేజీ అవుతూ భక్తులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. రూ. 1000 టికెట్ కౌంటర్ వద్ద బారీగా చేరిన నీరు పలు చోట్ల ఇనుపచువ్వలు తేలి ప్రమాదకరంగా మారాయి. వసతి, విశ్రాంతి, సముదాయాలు మూత్రశాలలు, మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. నిధులు మంజూరు చేస్తేనే ఆలయ అభివృద్ది జరుగుతుంది.