వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా తీరం దాటి అక్కడే స్థిరంగా ఉందని దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం కారణంగా గాలులు సడులు తిరుగుతూ రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. అల్పపీడనం సుమద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, నైరుతి దిశగా వంగి ఉందని అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశాను ఆనుకుని జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
అయితే అల్పపీడనం బలహీన పడుతుందా, తిరిగి సముద్రంలోకి వస్తుందా అనే విషయంపై స్పష్టత లేదని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రలోని మిగిలిన జిల్లాల్లో అడక్కడక్క వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పాటు మరో మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ఆకుపచ్చ రంగు హెచ్చరికలు జారీ చేసింది.