మనతెలంగాణ సిటీ బ్యూరో ః గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం 6 గం.ల ప్రాంతంలో వర్షం దంచికొట్టింది. ఏకధాటిగా 45 ని.లు భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, అంబర్ పేట్, కాచిగూడ, ఓయూ క్యాంపస్, విద్యానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి.
లకిడీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్ సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ ప్రయాణం కోసం గంటల సమయం పట్టింది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో నగర వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేసింది.