మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాంచందర్‌రావు రైటర్ మాత్రమేనని, పైటర్ కాదని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కానీ వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తి అన్నారు. అమిత్ షా తనకు ఫోన్ చేశారని, బీజేపీలో చేరతారని వస్తున్న వార్తలపై ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ఫేక్ వార్తలు అని, అమిత్ షా తనకు ఫోన్ చేశారని వార్తలు వస్తున్నాయని తాను అంతపెద్ద వ్యక్తిని కాదని రాజాసింగ్ అన్నారు. ఎప్పుడు కూడా అమిత్ షా తనకు ఫోన్ చేయలేదని , తాను చాలా చిన్నవ్యక్తిని అన్నారు. వాళ్లు పెద్ద మనుషులు అని ఎందుకు కాల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదేళ్లపాటు కేంద్రానికి లేఖ రాశానని, తెలంగాణలో జరుగున్న తప్పుల గురించి లేఖలో పేర్కొన్నానని అన్నారు. కానీ అది వాళ్ల వరకు చేరిందో లేదో అని అప్పటికే తెలంగాణలో పెద్దతప్పు జరిగిందన్నారు. ఇప్పటివరకు తెలంగాణ బీజేపీలో జరుగుతున్న సమస్యలను కేంద్రానికి చెప్పేవరకే ఎవరిని వదిలే ప్రసక్తిలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు తీవ్రఅన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ఎవరితో నష్టం జరుగుతుందో అధికారంలోకి రాకుండా కుట్రలు ఎవరు చేస్తున్నారో వాటి వివరాలు బీజేపీ పెద్దలకు తప్పకుండా వివరిస్తానని తెలిపారు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టాలంటే పార్టీకి పైటర్ఖచ్చితంగా అవసరం ఉందన్నారు. తనపై కొందరు కుట్రలు చేస్తూ రాజాసింగ్ మళ్లీ పార్టీలోకి వస్తాడని సోషల్ మీడియాతో ప్రచారం చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చే విధంగా పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పార్టీలో జరగుతున్న విషయాలను ఐబీ, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తెప్పించుకుంటుందని పేర్కొన్నారు. పార్టీని నాశనం చేస్తున్న వ్యక్తులను వదలిపెట్టే ప్రస్తకిలేదని, వారి అరాచకాలు, భాగోతం కేంద్ర పెద్దలకు వివరించే వరకు ఆపార్టీలో అడుగు పెట్టనని తేల్చి చెప్పారు.