రీల్స్ చేసి సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వడానికి కొత్త కొత్త మార్గలు వెతుకుతున్నారు కొందరు. అందులో కొన్ని ప్రాణాంతకం అవుతున్నాయి. అలా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసి కూడా అలాంటి రిస్కీ రీల్స్ చేసే వాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా ఓ తల్లిదండ్రులు (Rajasthan Parents) రీల్ కోసం ఏకంగా తమ కూతురి ప్రాణాలతో చెలగాటం ఆడారు.
రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో బరేథా జలాశాయం వద్ద ఓ జంట తమ ఏడేళ్ల కూతురిని జలాశయం గోడకు ఉన్న రాడ్స్‌పై అమర్చిన విద్యుత్ బాక్స్‌పై కూర్చోబెట్టారు. ఆ చిన్నారి అక్కడకు వెళ్లేందుకు భయపడుతున్నా.. వాళ్లు మాత్రం ఆమెని ప్రోత్సాహించారు. కొంచెం అదుపు తప్పిన ఆ చిన్నారి జలాశయంలో పడిపోయే ప్రమాదం ఉండేది. కానీ, ఆ జంట (Rajasthan Parents) మాత్రం దాన్ని పట్టించుకోలేదు. విద్యుత్ బాక్స్‌పై కూర్చోగానే కెమెరాని చూడమంటూ సైగ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
పిల్లలకు అలాంటి లైఫ్ రిస్క్ పనులు చేయవద్దని చెప్పాల్సిన తల్లిదండ్రులే ఇలాంటి పనులు చేయాలని ప్రోత్సహించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని దానిపై తగిన చర్యలు తీసుకుంటామని బరేథా పోలీసులు తెలిపారు. సందర్శకుల భద్రత దృష్ట్యా జలాశయం వద్ద ఓ కానిస్టేబుల్‌ని ఏర్పాటు చేశామన్నారు.