సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున కలయికలో వచ్చిన సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా ఆమిర్ ఖాన్, ఉపేంద్ర ప్రత్యేక పాత్రల్లో నటించారు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే తలైవా రజనీకాంత్ చేసిన ‘కూలీ’ ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందో చూద్దాం.
కథ: దేవా (రజనీకాంత్) విశాఖపట్నంలో ఒక మాన్షన్ నడిపే నడి వయస్కుడైన వ్యక్తి. అతడి స్నేహితుడైన రాజశేఖర్ (సత్యరాజ్) అనుమానాస్పదంగా చనిపోవడంతో తన మరణానికి కారణం ఎవరో తెలుసుకునే పనిలో పడతాడు దేవా. పోర్టులో అక్రమ వ్యాపారం చేసే సైమన్ (నాగార్జున) గ్యాంగ్ దీని వెనుక ఉన్నట్లు అర్థం చేసుకుని.. వాళ్ళ మనిషిలా కలిసిపోయి తన మిషన్ మొదలు పెడతాడు దేవా. ఇంతకీ రాజశేఖర్ నేపథ్యం ఏంటి.. సైమన్ మనుషులు అతడిని ఎందుకు చంపారు.. పోర్టులో అడుగు పెట్టిన దేవా.. సైమన్ గురించి ఏం తెలుసుకున్నాడు.. చివరికి తన స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-, విశ్లేషణ: తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాలో ఏం చెప్పదలుచుకున్నాడో.. ఇందులో ఏ పాత్ర ఏంటో.. ఏ సన్నివేశం ఉద్దేశమేంటో తెలుసుకోవడం సామాన్య ప్రేక్షకుడికి కష్టమే. రజనీకాంత్, లోకేష్ కాంబినేషన్ మీద పెట్టుకున్న అంచనాలకు దరిదాపుల్లో కూడా ఈ సినిమా నిలవదు. ఏ సినిమా అయినా.. మొదలైన అరగంటకో.. గంటకో.. లేదంటే ఇంటర్వెల్ సమయానికి అయినా కథేంటి.. పాత్రలేంటి అన్నది అర్థం కావాలి. కానీ ‘కూలీ’ సినిమా విషయంలో మాత్రం శుభం కార్డు పడ్డాక కూడా శేష ప్రశ్నలు అలాగే ఉండిపోతాయి. నాగ్ చేసిన సైమన్ పాత్రలో ఏం మర్మం ఉందో.. సౌబిన్ షాహిర్ ఏం మ్యాజిక్ చేస్తాడో.. ఉపేంద్ర..
ఆమిర్ ఖాన్ పాత్రలతో ఏం ట్విస్టులు ఇస్తారో అని ఉత్కంఠగా సినిమా చూస్తుంటే.. ఒక్కో పాత్ర నీరుగారిపోవడం మొదలవుతుంది. రజనీ చేసిన దేవా పాత్రే తుస్సుమనిపించేయడంతో ఉత్సాహం చల్లబడిపోతుంది. సైమన్ క్యారెక్టర్లో నాగార్జున కేవలం లుక్స్‌తో మాత్రమే ఆకట్టుకుంటాడు తప్ప.. ఆ పాత్ర ప్రవేశించే వరకు ఇచ్చే బిల్డప్‌కి.. తర్వాత అది ప్రవర్తించే తీరుకు పొంతన ఉండదు. దేవాగా రజనీకాంత్ తనదైన స్టైల్లో చేసుకెళ్లిపోయారు. డాన్స్‌లు, ఫైట్‌ల విషయంలో పెద్దగా కష్టపెట్టకుండా వయసుకు తగ్గట్టుగా అన్ని సెట్ చేశారు. శ్రుతి హాసన్ కథలో కీలకమైన పాత్రలో పర్వాలేదనిపించింది. సినిమాలో కథనం చాలా చోట్ల బోరింగ్‌గా సాగడంతో ‘కూలీ’ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.