ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం ఉత్తర్ ప్రదేశ్ లో బ్రహ్మోస్ తయారీ యూనిట్ ను రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. కేవలం పాకిస్తాన్ సరిహద్దే కాదు.. రావల్పిండి పైనా దాడి చేశామన్నారు. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తిని తెలియజేశామని అన్నారు. 40 నెలల్లోనే బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్‌ను పూర్తి చేశారని… ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్ సిద్ధం చేసిన వారికి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
కాగా.. దాదాపు రూ.300 కోట్ల ఖర్చుతో బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉచితంగా 80 హెక్టార్ల స్థలాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగీ మాట్లాడుతూ.. బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్‌ను అడగండని చమత్కరించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత్ సందేశం ఇచ్చిందని చెప్పారు.