న్యూఢిల్లీ : దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం అంటూ ఏమీ ఉండదని, అలాగే శాశ్వత మిత్రులు కానీ, శత్రువులు కానీ ఉండరని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కేవలం ఆ దేశానికి ఉపయోగపడే శాశ్వత ప్రయోజనాలే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రణరంగంలో ఆత్మ నిర్భరత సాధించడం అత్యావశ్యకమని ఓ జాతీయ మీడియా సదస్సులో పాల్గొని మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు , ట్రంప్ టారిఫ్‌లు, ప్రధాని మోడీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్ అనుసరిస్తోన్న వైఖరిని వెల్లడించారు.
“ప్రపంచం వేగంగా మారుతోంది. అదే సమయంలో కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. మహమ్మారులు ఉగ్రవాదం, ప్రాంతీయ ఘర్షణలు వంటి వాటితో ఈ శతాబ్దం అత్యంత సవాలుతో కూడి ఉందని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మన వ్యూహాత్మక అవసరాల దృష్టా .. ఆత్మనిర్భరత అనేది అత్యావశ్యకం. మనకు శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. భారత్ ఎవరినీ శత్రువుగా పరిగణించదు. మనరైతులు, వ్యాపారవేత్తల ప్రయోజనాలే మనకు ముఖ్యం. ప్రస్తుతం మారుతున్న భౌగోళిక, రాజకీయాల కారణంగా రక్షణ పరంగా విదేశాలపై ఆధారపడటం సరైన ఎంపిక కాదని స్పష్టమవుతోంది. స్వావలంబన్ అనేది మన ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు అత్యవసరం. 2014లో మనరక్షణ రంగం ఎగుమతుల విలువ రూ.700 కోట్లు. ఇప్పుడది రూ.24 వేల కోట్లకు చేరింది.
ఈ గణాంకాలు చూస్తుంటే భారత్ ఒక కొనుగోలు దారుగానే మిగలకుండా ఎగుమతిదారుగా మారుతుందని వెల్లడవుతోంది. ఇక మన బలగాలు స్వదేశీ పరికరాలతో లక్షాలపై కచ్చితత్వంతో చేసిన దాడులు… దూరదృష్టి, సమన్వయానికి నిదర్శనం. అలాంటి సన్నద్ధత లేకపోతే ఏ మిషన్ విజయవంతం కాదు. ” అని మంత్రి పేర్కొన్నారు. భారత్‌ను మిత్రదేశం అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల మోత మోగించారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించారు. అవి ప్రస్తుతం అమలవుతున్నాయి. ఈ తరుణం లోనే ఐడేళ్ల తరువాత తొలిసారి ప్రధాని మోడీ చైనా పర్యటనకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.