Wednesday, September 17, 2025

ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమే…అంతం కాదు: రాజ్‌నాథ్

- Advertisement -
- Advertisement -

భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు
విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అంగరంగ వైభవంగా వేడుక

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు…ఆపరేషన్ సిందూర్ అరంభం మాత్రమే…అంతం కాదు..’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ ఆపరేషన్ సిందూర్ ముగియలేదన్నారు. పహల్గాంలో తీవ్రవాదులు మన భారతీయులను మతం అడుగుతూ చంపారని ఆయన తెలిపారు. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో మన సైనికులు తీవ్రవాది మసూద్ అజర్‌ను మట్టుబెట్టారని, స్థావరాలను ధ్వంసం చేశారని ఆయన చెప్పారు. మన సైనికులు చాటిన సత్తాను ప్రపంచం అంతా ఆసక్తిగా గమనించిందని ఆయన తెలిపారు. దేశంలో ఎన్ని విభేదాలు ఉన్నా దేశం విషయంలో అందరూ కలిసి ఒకే మాటపై ఉంటామని, దేశ రక్షణ, భద్రత విషయంలో ఏకతాటిపై ఉంటామన్నారు. మన దేశం ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిందని ఆయన తెలిపారు.

పటేల్ సమర్థత వల్లే..
నాడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత వల్లే నిజాం తన ఓటమిని అంగీకరించి లొంగి పోయాడని ఆయన చెప్పారు. దీంతో భారత్‌లో హైదరాబాద్ రాజ్యం విలీనమైందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మ మార్గంలో నడుస్తామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. జాతీయ సమర్థతను దెబ్బ తీసే కుట్రలను తిప్పికొడతామన్నారు. పటేల్ కన్న కలలకు అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడి పాలన సాగుతున్నదని ఆయన చెప్పారు. భారత్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని కళ్ళలో కళ్ళు పెట్టి చూసే సాహసాన్ని శతృవులు చేయలేరని అన్నారు.
తెలుగులో నమస్కారం..
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలుత తెలుగులో ‘అందరికీ నమస్కారం, జోహార్ తెలంగాణ’ అని చెప్పి ఆ తర్వాత హిందీలో ప్రసంగాన్ని ప్రారంభించారు.
త్యాగధనుల ఫలితమేః కేంద్ర మంత్రి షెకావత్
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రసంగిస్తూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా, ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఉక్కు పాదం మోపడంతో నియంత నిజాం దిగి వచ్చాడని అన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని ఆయన చెప్పారు.

మజ్లీస్ నేతలకు వంగి, వంగి దండాలా?: కిషన్ రెడ్డి గరం
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ మజ్లీస్ నేతలకు భయపడి చరిత్రను వక్రీకరిస్తున్నారని, విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపేందుకు జంకుతున్నారని విమర్శించారు. మజ్లీస్ నేతలకు వంగి, వంగి దండాలు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మూడేళ్ళ తర్వాత అధికారంలోకి రాగానే అధికారికంగా జరుపుకుందామని ఆయన తెలిపారు. ఖాసీం రజ్వీ నేతృత్వంలో మజ్లీస్ వారి ఆగడాలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం గురించి పాఠ్యాంశాల్లో చేర్చలేదని ఆయన విమర్శించారు. కర్నాటకలో అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించినప్పుడు మన వాళ్ళకు ఏమి రోగం వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి బండి ధ్వజం
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తూ ఒక పార్టీ మెప్పు కోసం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని పరోక్షంగా మజ్లీస్ పార్టీని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. బిజెపి అధికారంలోకి రాగానే బ్రహ్మండంగా జరుపుకుందామని ఆయన తెలిపారు. నిజాం నిరంకుశ పాలనలో మహిళలపై అత్యాచారాలు జరిగాయని, అర్థనగ్నంగా ఊరేగించారని, ఉర్దూ బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. పరకాలలో జాతీయ జెండా ఎగుర వేసిన వారిని చంపారని ఆయన తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం రోజే ప్రధాని నరేంద్ర మోడి జన్మదినం కావడం, విశ్వకర్మ జయంతి కూడా ఉండడం సంతోషకరమని అన్నారు. బిజెపి సహకారం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడి 12 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరించారు.

పటేల్ విగ్రహం ముందు..
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉదయం 9 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని సర్దార్ పటేల్ విగ్రహానికి, హైదరాబాద్ విమోచన అమర వీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి, నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన ఆర్మీ వాహనం (ఓపెన్ టాన్ జీప్)పై నిలుచొని సైనిక బలగాల పరేడ్‌లో పాల్గొన్నారు. అనంతరం వివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
మంగళవాయిద్యాలు..
తెలంగాణ కళారూపాలను తెలియజేసే మంగళవాయిద్యాలు, నాద స్వరం, కోలాం, బాంద్రీ, లంబాడి, బోనాలు, మద్వ, కొమ్మ కోయ, గుస్సాడి కళాకారుల ప్రదర్శనను కేంద్ర మంత్రులు వీక్షించారు.

Also Read: తీన్మార్ మరో పెరియార్ అవుతాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News