రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మరో వ్యక్తితో కలిసి భర్త రాకేష్ కుమార్‌ను భార్య పూనమ్ దేవి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని బావి పక్కన పడేసి.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యారు. అజీజ్‌నగర్‌కు చెందిన రాజిరెడ్డి డెయిరీ ఫామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రెండు నెలల క్రితం ఫామ్‌లో రాకేష్ దంపతులు కూలీలుగా చేరారు. ఈ నెల 21న రాకేష్ దంపతులతో పాటు మహేశ్ సాని అనే మరో వ్యక్తి కనిపించాడు. తర్వాతి రోజు నుంచి రాకేష్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని యజమాని రాజిరెడ్డి నిలదీశాడు. దీంతో మద్యం తాగొచ్చి తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లిపోయాడని భార్య పూనమ్ బుకాయించింది. రాజేశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో యజమాని ఏజెంట్‌కు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో పూనమ్ దేవి, మహేశ్ సాని కలిసి రాకేష్‌ను చంపి బావి వద్ద పడేశారని ఏజెంట్ యజమానితో చెప్పాడు. యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాయితో తలపై కొట్టి చంపినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.