భోపాల్: ఎలుకలు కరవడంతో ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని మహారాజా యశ్వంత్ రావు ఆస్పత్రిలో జరిగింది. రెండో శిశువు మృతికి కారణం ఎలుక కాటు కాదని బ్లడ్ ఇన్ఫెక్షన్ తో మృతి చెందిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం…. ఇండోర్‌లోని మహారాజ్ యశ్వంత్ రావు ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్న నవజాత శిశువులను ఎలుకలు కరవడంతో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. శిశువుల మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ వార్త వైరల్ కావడంతో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇండోర్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని, ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని వారికి ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Also Read: చెత్తగాళ్ల వెనుక… నేనెందుకు ఉంటా
మహారాజ్ యశ్వంత్ రావు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర వర్మ మీడియాతో మాట్లాడారు. బుధవారం చికిత్స సమయంలో మరణించిన శిశువు తక్కువ బరువుతో (కేవలం 1.60 కిలోగ్రాములు) జన్మించిందని, ఆమెకు పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిలో ఒకటి పేగుల సంబంధిత లోపం ఉందని తెలియజేశారు. ఆ శిశువుకు ఏడు రోజుల క్రితం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిందని పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం అప్పటికే అత్యంత విషమంగా ఉందని, రక్తంలో ఇన్ ఫెక్షన్ రావడంతో మృతి చెందిందని తెలిపారు. ఆ శిశువు మృతదేహానికి ఆమె కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు పోస్టుమార్టం నిర్వహించకుండా వారికి అప్పగించామని డాక్టర్ వర్మ వివరించారు. శిశువు ఎడమచేతి రెండు వేళ్లపై ఎలుకలు కరవడంతో గాయాలు ఉన్నాయని చెప్పారు. ఎలుకలు కరవడంతో శిశువు మృతి చెందలేదని, ఇప్పటివరకు ఈ ఘటనలో ఆసుపత్రికి చెందిన సుమారు ఆరుగురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని, నిర్లక్ష్యం కారణంగా పిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతికి షోకాజ్ నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు.