సిద్దిపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులను ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాలకు దాదాపు 10 వేల రేషన్ కార్డులు అందిస్తున్నామని వెల్లడించారు. సిద్దిపేట పట్టణంలోని కొండా మల్లయ్య గార్డెన్స్ లో సిద్దిపేట అర్బన్ మండలం, సిద్దిపేట రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు.
జిల్లా వ్యాప్తంగా పాత రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల చేర్పులు, కొత్త కార్డులు కలిపి 52 వేల మందికి అదనంగా లబ్ధి చేకూరుతుందని వివరించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఎలా సేవ చేయాలనే అలోచించి ప్రజా ఉపయోగ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని, దానిలో ఒకటి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని తెలియజేశారు. 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్నారని, గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యంను లబ్ధిదారులు వాడలేదన్నారు. కానీ పేద ప్రజలకు రుచికరమైన పౌష్టికహారం అందించాలినే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కారు రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని వివేక్ వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 9 వేల కోట్ల రూపాయలను సన్నబియ్యం పథకం అమలు కోసం ఖర్చు చేశామని, రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం మాత్రమే కాకుండా 200 రూపాయలకే ఫ్రీ కరెంట్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, అనేక పథకాలు ఈ కార్డుల ద్వారా అందిస్తామని స్పష్టం చేశారు. ఇంకా సరైన వారికి కొత్త కార్డులు అందిస్తామని, అదనంగా పేర్లను చేర్చుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 8 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఉన్నా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆపలేదని వివరించారు. వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజి రుణాలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా రాష్ట్రం అని వివేక్ ప్రశంసించారు.
మన రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్ని చూసి ఇతర రాష్టలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, డబ్బుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేద ప్రజలకు ఇవ్వలేదని, 12 ఏళ్ల క్రితం ఇందిరమ్మ ఇళ్ళను ఇచ్చామని, అదేవిధంగా పెద్ద ప్రజలకు సొంత ఇంటి కలను నెరవేరుస్తూ మళ్లీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తున్నామని తెలియజేశారు.
సిద్దిపేట నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, జిల్లాకు మొత్తం 10 వేల ఇండ్లకు పైగా మంజూరు చేశామన్నారు. మంత్రివర్గ సమావేశంలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఇండ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్య తీసుకుందని, సిద్దిపేట అభివృద్ధి కోసం అవసరమైన నిధులు తీసుకొస్తానని, అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని వివేక్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, ఎస్సి ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా ఇన్చార్జి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగర్వాల్, సిద్దిపేట ఆర్ డిఒ సదానందం, డిఎం సివిల్ సప్లై ప్రవీణ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.