భారత టెస్ట్ క్రికెట్‌లో భవిష్యత్తు ఆల్ రౌండర్ ఎవరంటే వెంటనే అందరూ వాషింగ్టన్ సుందర్ పేరు చెబుతారు. ఇప్పటికే అశ్విన్ రిటైర్ కాగా, రవీంద్ర జడేజా కెరీర్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత టెస్ట్ క్రికెట్‌కి సుందర్ సేవలు ఎంతో అవసరం. తాజాగా టీం ఇండియా మాజీ ప్లేయర్, మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) సుందర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
కెరీర్ ఆరంభం నుంచి వాషింగ్టన్ సుందర్ ఆటను గమనిస్తున్నా అని చెప్పిన రవిశాస్త్రి (Ravi Shastri).. జట్టులో సుదీర్ఘ కాలం ఆల్ రౌండర్‌గా కొనసాగే సత్తా సుందర్‌కి ఉందని కితాబిచ్చారు. ‘‘ప్రస్తుతం సుందర్ వయస్సు 25 ఏళ్లే.. అతను ఇంకా చాలా టెస్ట్ క్రికెట్ ఆడాల్సి ఉందని నా అభిప్రాయం. భారత్‌లో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లో అతను డేంజరస్ బౌలర్‌గా మారొచ్చు. గతేడాది న్యూజిలాండ్.. భారత పర్యటనకు వచ్చినప్పుడు సుందర్ ఎలాంటి ప్రభావం చూపించాడో అందరికీ తెలుసు. సీనియర్ స్పిన్నర్ల కంటే అతడు గొప్పగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ అతడు సత్తా చాటగలడు’’ అని రవిశాస్త్రి అన్నారు.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో సుందర్ ఫర్వాలేదు అనిపిస్తున్నాడు. కీలక సమయంలో పరుగులు, వికెట్లు రాబడుతున్నాడు. ఇప్పటివరకూ రెండు టెస్టులు ఆడిన అతను 77 పరుగులు చేసి ఐదు వికెట్లు తీశాడు.