భారత స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అశ్విన్ నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సిరీస్ మధ్యలో అశ్విన్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అశ్విన్ నిర్ణయం భారత క్రికెట్లో పెను ప్రకంపనలు సృష్టించింది. కాగా, తన రిటైర్మెంట్ నిర్ణయాణికి గల కారణాలను అశ్విన్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్గవాస్కర్ సిరీస్‌లో తనకు తగినన్ని అవకాశాలు రాలేదన్నాడు. తుది జట్టులో చోటు దక్కక పోవడంతో బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చిందన్నాడు. ఇలా జట్టుకు దూరంగా ఉండడం తనకు నచ్చలేదన్నాడు.
జట్టుకు తన అవసరం లేనప్పడూ ఆటలో కొనసాగి ప్రయోజనం లేదని భావించి అప్పటికప్పుడూ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు. సుదీర్ఘ కాలంగా కొనసాగిన కెరీర్‌తో కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేక పోయాయని, మరోవైపు పెరుగుతున్న వయసు కూడా ప్రతికూలంగా మారిందన్నాడు. ఇలాంటి స్థితిలో ఆట నుంచి తప్పుకోవడమే మంచి నిర్ణయం అని భావించానన్నాడు. రిటైర్మెంట్ నిర్ణయం అనేది తానంతట తానే తీసుకున్నానని, దీనిలో ఎవరి ఒత్తిడి లేదని అశ్విన్ స్పష్టం చేశాడు.