Monday, August 25, 2025

మరో గ్రంథాలయ ఉద్యమం అవసరం

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్ 8వ తేదీ వాక్ ఫర్ బుక్‌లో కలిసి నడుద్దాం:  ఒకప్పుడు గ్రంథాలయ ఉద్యమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ప్రాంతాలలో ఉధృతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, తెలంగాణలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, వెల్దుర్తి మాణిక్యరావు మొదలైనవారు గ్రంథాలయ ఉద్యమాన్ని దిగ్విజయంగా నడిపించారు. గ్రంథాలయ ఉద్యమం ప్రజలలో చైతన్యం తేవడానికి, అజ్ఞానాన్ని, మూఢ నమ్మకాలను సాంఘిక దురాచారాలను, నిరక్షరాస్యతను, పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యాలతో మొదలైంది. గ్రంథాలయాల ఏర్పాటు, ఇతర భాషల నుండి ఉత్తమ సాహిత్యాన్ని అనువదించడం, ప్రచురించడం వంటి పనుల ద్వారా ప్రజలకు మంచి పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి.

దీని ఫలితంగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం పెరిగింది. ప్రజలలో చైతన్యం పెరిగేందుకు, నూతన ఆలోచనలకు పుస్తక పఠనం దారులు వేసింది. తెలంగాణ సాయుధ పోరాటానికి, దేశ స్వాతంత్య్ర పోరాటానికే గాక తెలుగు ప్రజలు సాగించిన అనేక ఉద్యమాలకు గ్రంథాలయ ఉద్యమం అందించిన జ్ఞానం అపారమైంది. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో అక్షరాస్యత పెంపొందించడం కోసం, ముఖ్యంగా పిల్లలు అర్థవంతమైన జ్ఞానాన్ని పొందడం కోసం, మా తృభాషను కాపాడుకోవడం కోసం మరో గ్రంథాలయ ఉద్యమం అవసరమైంది. అస్తవ్యస్తమైన విద్యా విధానాలు, మనుషులను విధ్వంసానికి గురిచేస్తున్న సెల్‌ఫోన్ టెక్నాలజీ, సోషల్ మీడియాల మత్తు నుండి, కాస్త పక్కకు మళ్ళించి పిల్లలకు వివిధ అంశాలపై అవగాహన కలిగించడానికి మరోసారి గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం మనకి ఏర్పడింది.

మనిషి జీవనానికి ఆధారం బాల్యం. ఆ బాల్యం సంతోషంగా, విజ్ఞానవంతంగా సాగిపోతేనే మనిషి జీవితం ఆనందమయం అవుతుంది. కానీ ఇవాళ బాల్యానికి ఆనందం అందటం అన్నది ఎండమావే అయ్యింది. ఈ పరిస్థితికి మన విద్యా విధానం ముఖ్య కారణం. మాతృభాషలో విద్యాబోధనతో పాటూ, సాహిత్యం పిల్లల్ని ఆనంద డోలికల్లో తేలియాడేలా చేస్తుంది. విద్య అనేది పరభాషలో అర్థంపర్ధం తెలియని చదువు గా రానురానూ మారిపోతూ ఉంది. బాల్యం నుండి సృజనాత్మకత వైపుగా నడవాల్సిన విద్య, పిల్లల్లో సృజనను అణచివేసి, వారిలో యాంత్రికతను, క్రూరత్వాన్ని, నింపేలా అంతకంతకూ తయారవుతున్నది. విద్యా విధానంలో ‘బట్టీయం చదువులు తప్ప’ మంచి, చెడు, మానవత్వం, విలువలకు సంబంధించిన విషయాలు చెప్పే నాధులే కరువైపోయారు. దీనితో క్రమంగా మనుషులు మరమనుషులుగా మారుతున్నారు.

పిల్లలు, పెద్దలు కూడా ఎందుకు బ్రతకాలో వారి జీవితాదర్శం, లక్ష్యం, ప్రయాణం ఎలా ఉండాలో తెలియని సందిగ్ధావస్థలో, టెక్నాలజీ మాయలో, సోషల్ మీడియా సుడిగుండంలో విలవిల్లాడిపోతున్నారు. అసంబద్ధమైన నేటి విద్యావ్యవస్థలో, ఉపాధ్యాయ లోకంలో, సమాజంలోనూ పుస్తక పఠనమనే ప్రక్రియకు అర్థమే తెలియని పరిస్థితి క్రమంగా దాపురించింది.
కోటాను కోట్ల రూపాయల గ్రంథాలయ పుస్తకాలను పాఠశాలలకు అందజేసినా అవి పిల్లల దాకా చేరడం లేదు. విద్యాసంస్థలు, ప్రభుత్వాలు నిర్వహించే గ్రంథాలయాలు సరైన నిర్వహణ లేక నామమాత్రంగా మిగులుతున్నాయి. పిల్ల ల్లో, యువతలో జీవితానికి సంబంధించిన తాత్వికత పెంపొంది, బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు కావాలంటే, విసృత అధ్యయనం, పరిశీలన, సమాజం తీరూతెన్నులను, బహుళ సంస్కృతులను, జీవన విధానాలను అర్ధం చేసుకోవడం అవసరం.

అందుకు పుస్తక పఠనం దోహదపడటమే గాక, కొత్త ప్రపంచానికి దారులు చూపుతుంది. సాహిత్య సృజన విద్యా సంస్థలలోనే మొదలు కావాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక దశలో, పాఠశాల కళాశాలల్లో గ్రంథాలయాల అభివృద్ధి, విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలను తీసుకురావడం ఇప్పటి అవసరం. ప్రభుత్వ గ్రంథాలయాల పునరుద్ధరణ, ఆధునీకరణ, కొత్త గ్రంథాలయాల ఏర్పాటు, పుస్తక ప్రచురణలకు, ప్రదర్శనలకు తోడ్పాటు అవసరం. ఈ లక్ష్యాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లో ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇందుకోసం సెప్టెంబర్ 8న ‘వాక్ ఫర్ బుక్’ కార్యక్రమంతో మొదలై ఒక సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు ఉభయ రాష్ట్రాల్లోనూ జరుగుతాయి. ఇది ఒక ఉద్యమంలా సాగాలి. సబ్బండ వర్ణాల ప్రజ లు, కవులు, కళాకారులు, రచయితలు, పుస్తక ప్రచురణకర్తలు, పాఠకులు, పుస్తకాలను, అక్షరాలను ప్రేమించే ప్రతి ఒక్కరూ మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగం అవుదాం.

– మాచికంటి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News