ఆ ఆస్పత్రిలో పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. డాక్టర్ కూడా ఆలస్యంగా వచ్చాడు. వచ్చిన డాక్టర్ పేషంట్లను కలవకుండా ముందుగా మెడికల్ రిప్రజెంటేటివ్స్‌తో మాట్లాడాడు. దీంతో చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. తన కోపాన్ని అతను విచక్షణ మరిచి రిసెప్షనిస్టుపై చూపించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ (Kalyan Maharashtra) ప్రాంతంలో జరిగింది.
బాధిత మహిళ కళ్యాణ్ ప్రాంతంలోని (Kalyan Maharashtra) నందివాలీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. సోమవారం ఆమె విధుల్లో ఉండగా.. ఆస్పత్రికి కొందరు రోగులు వచ్చారు. డాక్టర్ రాకపోవడంతో వారిని వేచి ఉండమని సదరు యువతి చెప్పింది. ఆలస్యంగా వచ్చిన డాక్టర్ మెడికల్ రిప్రజెంటేటివ్స్‌తో ముచ్చట్లు పెట్టాడు. అప్పటికే వేచి ఉన్న పేషంట్లు రిసెప్షనిస్టుగా పని చేస్తున్న యువతిని నిలదీశారు.
అందులో ఓ వ్యక్తి తన కుమారుడి వైద్యం కోసం వచ్చాడు. అపాయింట్‌మెంట్ లేకుండా అతను డాక్టర్ క్యాబిన్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో బాధిత యువతి అతడిని అడ్డగించింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి యువతిపై దాడి చేశాడు. కాలితో తన్ని, జట్టు లాగి తీవ్రంగా కొట్టాడు. పక్కనే ఉన్న కొందరు అతడిని పట్టుకొని బయటకు పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన నిందుతుడు గోకుల్ ఝాను అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.