మన తెలంగాణ/హైదరాబాద్: ఐఏఎస్‌లు నచ్చిన పోస్టింగ్ కోసం సిఫార్సు లేఖలు కావాలని మంత్రుల చుట్టూ తిరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ సిఫార్సు లేఖలు భా రీ ఎత్తున సిఎస్‌కు రావడంతో పోస్టుల కేటాయింపు సిఎస్‌కు తలనొప్పిగా మారింది. వివిధ శాఖల్లో పనిచేసే అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలతో పాటు వారితో ఉన్నతాధికారులకు ఫోన్‌లు చేయించి పోస్టింగ్‌లు తీసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ, ఐఏఎస్‌లు కూడా తమకు మంచి పోస్టింగ్ కా వాలని ఫైరవీలు చేయించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ట్రైనీ ఐఏఎస్‌లు కూడా అదే బాటలో….
కలెక్టర్‌ల పనితీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వారి పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇస్తోంది. ఇప్పటికే పలుమార్లు పలు జిల్లాల కలెక్టర్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీల పనితీరును మార్చుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అయినా, కొందరిలో మార్పు రాకపోవడంతో వారిని వివిధ జిల్లాలకు, వేరే శాఖలకు ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో కొందరు ఐఏఎస్‌లు సిఎస్‌ను, సిఎంను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. వీరితో పాటు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ట్రైనింగ్ ఐఏఎస్‌లు సైతం సిఫార్సు లేఖల కోసం ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.
స్పెషల్ ఆఫీసర్‌లు వర్సెస్ కలెక్టర్‌లు
ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకోవడం, పాలనను పరుగెత్తించడం కోసం జూలైలో ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. అయితే, ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించడంతో కొన్ని జిల్లాల కలెక్టర్‌లు ఇబ్బందులు పడుతున్నారని, దీంతో స్పెషల్ ఆఫీసర్లకు, పలు జిల్లాల కలెక్టర్‌లకు వార్ నడుస్తోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో తమకు మంచి పోస్టింగ్ కావాలని స్పెషల్ ఆఫీసర్లతో పొసగని పలు జిల్లాల కలెక్టర్‌లు మంత్రులతో తమను వేరే చోటుకు బదిలీ చేయించాలని సిఎస్‌కు సిఫార్సు చేయిస్తున్నట్టుగా సమాచారం. ప్రభుత్వం మాత్రం పాలనను పరుగెత్తించడం, పథకాలను పేదలకు చేర్చడం కోసం స్పెషల్ ఆఫీసర్‌లను నియమిస్తే చివరకు అది స్పెషల్ ఆఫీసర్‌లు, కలెక్టర్‌ల మధ్య వార్‌గా కొనసాగుతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తుండడంతో దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది.
మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు
ఇలా, ప్రభుత్వం పేదల కోసం పలు పథకాలను ప్రవేశపెడుతుంటే ఐఏఎస్‌లు మాత్రం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా వ్యవహారించడం ప్రస్తుతం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అయితే, పనితీరు బాగాలేదని ప్రభుత్వం బదిలీ చేస్తే ఐఏఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.