మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని చాలా మంది ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్న ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ మంది ఉంటే ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే ని బంధనను తొలగించాలని తెలంగాణ ప్ర భు త్వం నిర్ణయించింది. గత ఏడాది ఈ నిబంధనను ప్రభుత్వం తొలగిస్తుందని ఎదురు చూ శారు. అది కాస్త జరగకపోవడంతో నిరాశ చెందారు. ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు ఈ నిబంధనను ఎత్తివేసి ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చుననే ని బంధన అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేపట్టింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలే ఈ నిబంధనను ఎత్తివేసే ఆ లోచన ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సై తం వెల్లడించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. సర్పంచ్,ఎంపిటి సి, జడ్పీటిసి ఎన్నికలు
త్వరలో జరుగుతున్నందున ’ఇద్దరు పిల్లల’ నిబంధనపై ప్రభు త్వం తీసుకునే ఈ కీలక నిర్ణయం కోసం ప్ర జాప్రతినిధులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రస్తుతం ఉన్న నిబంధన ను రద్దు చేసేందుకు పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3)ని తొలగించేందుకు ప్ర భుత్వం సిద్ధపడుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మిగిలిన వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఈ నిబంధన తొలగింపు అనివార్యమని ప్ర భుత్వం భావిస్తోంది. ఈ నిబంధన సవరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది స్థానిక ప్రజాప్రతినిధులను గెలుచుకునేందు కు వ్యూహ రచన చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి పటిష్ట నాయకత్వం ఉండేందుకు ఈ అంశం దోహదపడుతుందని భావించిన స ర్కార్ 2018 సెక్షన్ 21(3)ని తొలగించి చట్టసవరణకు పావులు కదుపుతోంది.
అధిక జనాభాను నియంత్రించేందుకు గాను కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధన 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది. 1994లో తీసుకువచ్చిన ఈ నిబంధన వల్ల అప్పటి నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీకి చాలా మందికి అడ్డంకిగా మారింది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు సర్పంచ్, ఎంటీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఆనాటి ప్రభుత్వం చట్టం చేసింది. దాదాపు 30 ఏళ్లుగా ఈ నిబంధనే కొనసాగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు చాలా కాలంగా కోరుతూ వస్తున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఒకసారి ఈ నిబంధనను మార్చేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదిస్తే ఆమోదం లభించలేదు.
దీంతో పాత నిబంధననే కొనసాగాలని ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. అయితే ఇటీవల బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించి ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు అవకాశం ఇస్తూ చేసిన చట్ట సవరణ సమయంలోనూ ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపునకు సంబంధించి పంచాయితీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు అవసరమైన చట్టసవరణకు కూడా ప్రయత్నించలేదు. అయితే పంచాయితీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాలని మంత్రులు సైతం కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో ప్రవేశపెట్టిన ఈ పరిమితిని ఎత్తివేయడానికి ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేవని మంత్రులు అంతా మద్దతు ఇచ్చారు. త్వరలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టసవరణను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టాలా, లేదా బిల్లు ద్వారా ప్రవేశపెట్టాలా అనే విషయాన్ని తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్ణయించే అవకాశం ఉంది.
చట్టంలోని పలు కీలక అంశాలు ఇలా
ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీకి ముందు ఎంత మంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు అవుతారని ఆ చట్టంలో నిబంధనలు రూపొందించారు. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఒక ఏడాదిలోగా అంటే 1995 మే 29వ తేదీలోగా మూడో బిడ్డ పుట్టినా అనర్హులు కాకుండా మినహాయింపును ఇచ్చారు. 1995 మే 30వ తేదీ తర్వాత పుట్టిన పిల్లలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటా 1994లో ఆ చట్టం చేశారు. ఇక దీనిలో భాగంగా దత్తతకు సంబంధించిన పిల్లలు కూడా అసలు తల్లిదండ్రుల లెక్కలోనే ఉంటారు. ఈ మేరకు 2006లో హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. అంటే ఒక అభ్యర్థికి ముగ్గురు పిల్లలు ఉండి ఒకరిని దత్తత ఇచ్చేసినా వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని పేర్కొంది.
ఇక అభ్యర్థి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, రెండో భార్య ద్వారా మరో బిడ్డ ఉన్నా వారు అనర్హులుగానే ఆ చట్టం పరిగణించింది. నామినేషన్ వేసే నాటికి ముగ్గురు పిల్లలు ఉండి, పరిశీలన జరిగే రోజుకి అందులో ఒకరు చనిపోయినా వారు అర్హులు అవుతారని పేర్కొంది. ఇది ఇలావుంటే గత ఏడాది చట్ట సవరణ ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలు ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాయి. పంచాయతీ రాజ్ చట్టం నుంచి ఈ నిబంధనను తొలగిస్తూ ఏపిలో కూటమి ప్రభుత్వం గత ఫిబ్రవరిలో సవరణ తెచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి అమలులోకి తెస్తూ ఈ సవరణపై న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో ఇక తెలంగాణలో కూడా ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.