హైదరాబాద్: నిర్మాత కేదార్ మరణకారణాల రిపోర్టు అసెంబ్లీలో పెట్టడానికీ సిద్ధమేనని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. కేదార్ మరణంపై పూర్తి నివేదిక ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో రేవంత్ చిట్ చాట్ చేశారు. హైకోర్టు పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోందని, ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని తెలియజేశారు. ప్రభాకర్ రావుని రప్పించడంలో కేంద్రం ఏడాదిన్నర ఆలస్యం చేసిందని, రాష్ట్ర దర్యాప్తులో ఏం తప్పులున్నాయో ఎత్తి చూపించండి అని చెప్పారు. ఇడి కేసుల విచారణలో పురగతి ఎందుకు లేదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి అని ప్రతిపక్ష నేతగా మాజీ సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్లవచ్చునని అన్నారు.
రాష్ట్రం కోసం కెసిఆర్ పనిచేస్తానంటే ఎవరూ అడ్డుకోరు అని గతంలో డ్రగ్స్ కేసులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది తాను కాదు అని ఛాలెంజ్ చేయడం.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం కెటిఆర్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు. శాఖపరమైన విచారణలు రాత్రికి రాత్రి పూర్తికావు అని బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల (42 percent reservation BCs) అమలుపై తమకు వ్యూహం ఉంది అని రేవంత్ పేర్కొన్నారు. 2018లో కెసిఆర్ పంచాయితీరాజ్ చట్టంలో మార్పులు చేశారని, 50 శాతం రిజర్వేషన్లు వద్దని చట్టంలో మార్పులు చేశారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల కుదింపును సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, ఆర్డినెన్సుపై అవగాహన లేకుండా చాలామంది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ముస్లిం రిజర్వేషన్లను స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే ఉన్నాయని, ముస్లింలకు బిసి-ఇ గ్రూపులో రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు. బిజెపి రాష్ట్రాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, గుజరాత్, యూపి, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పారు. బిజెపి రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసిన తర్వాతే కిషన్ రెడ్డి మాట్లాడాలని సూచించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని వెల్లడించారు. కెసిఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కెసిఆర్ సూచనలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కిషన్ రెడ్డి లేఖలు రాయడం కాదని ప్రణాళికతో ముందుకు రావాలని, కిషన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. నిన్నటి సిఎం భేటీలో 3 అంశాల పరిష్కారానికి వచ్చాయని, బనకచర్ల సహా అన్ని అంశాలపై అధ్యయన కమిటీ వేశామని చెప్పారు. కమిటీ పరిష్కరించలేని అంశాలపై సిఎంలం మళ్లీ చర్చిస్తామని, నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు.
ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధించాలనే ప్రతిపాదన ఉందని, ప్రతిపక్షనేత పదవీ ఇవ్వాలని కెసిఆర్ ను కెటిఆర్ అడుగుతున్నారని తెలిపారు. కెటిఆర్ కోరికను కెసిఆర్ ఒప్పుకోవడం లేదని, సొంతవివాదలతోనే కెసిఆర్ కుటుంబానికి సరిపోతుందని అన్నారు. కెటిఆర్ నాయకత్వాన్ని ఎమ్మెల్సీ కవిత ఒప్పుకోవడంలేదని, హైదరాబాద్ లో నారాలోకేష్ ని కెటిఆర్ చీకట్లో ఎందుకు కలిశారని రేవంత్ ప్రశ్నించారు. కేదార్ తో కలిసి కెటిఆర్ దుబాయిలో డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్స్ కలగలిపి తీసుకోవడం వల్లే కేదార్ మరణించాడు అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.