Tuesday, July 8, 2025

సూపర్ పోలీసుకు జనం జేజేలు

- Advertisement -
- Advertisement -

‘సార్ మా భూమిని గూండాలు కబ్జా చేశారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేం పేదోళ్లం. మాకు న్యాయం చేయండి’ అంటూ గతంలో ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ‘ఇది సివిల్ కేసు. కోర్టుకు వెళ్లి తేల్చుకోండి. ఇందులో మేమేం చేయలేం’ అంటూ పోలీసులు తప్పించుకునేవాళ్లు. కొందరు తమను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బుల కోసం బెదిరిస్తున్నారని కంప్లయింట్ ఇస్తే.. ‘మమ్మల్నేం చేయమంటారు’ అని జవాబిచ్చేవారు. రౌడీల బెదిరింపులపై సమాచారమిచ్చినా లైట్ తీసుకునేవారు. కానీ ఆదిలాబాద్ ఎస్‌పిగా అఖిల్ మహాజన్ వచ్చాక పరిస్థితి మారింది. ఆయన ఆదేశాలతో పోలీసులు యాక్టివ్ అయ్యారు. సివిల్ కేసులు అని తప్పించుకోకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అన్నీ పరిశీలించి.. అక్రమార్కులపై కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపుతున్నారు.

దీంతో సామాన్య ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు కబ్జాల పర్వం కొనసాగించిన ‘రియల్’ అక్రమార్కుల ఇష్టారాజ్యానికి అఖిల్ మహాజన్ వచ్చాక బ్రేక్  పడింది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల కబ్జా చేస్తున్న, అక్రమ రిజిస్ట్రేషన్లు (Illegal registrations) చేస్తున్న కొంత మందిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడంతో రియల్ ఎస్టేట్‌లో అక్రమాలు చేసి కోట్లు సంపాదించిన వారి గుండెలు ఇప్పుడు గుభేల్ మంటున్నాయి. 2010లో ఖానాపూర్ శివారులో అటవీ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించిన కేసులో బిజెపికి చెందిన ఓ కీలక నేతపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. అంతేకాకుండా ‘రియల్’ మోసం కేసులో ఓ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతను సైతం అరెస్ట్‌చేశారు. మున్సిపాలిటీ ల్యాండ్‌ను ఫేక్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసి అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై సైతం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానని, ప్లాట్లు అమ్ముతానని చెబుతూ మోసం చేస్తున్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఓవ్యక్తిపై సైతం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని.. మున్సిపాలిటీ నుంచి నంబర్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిని సైతం జైలు ఊచలు లెక్కబెట్టేలా చేశారు. దీంతో ఇన్నాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన రియల్ ఎస్టేట్ అక్రమార్కులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వివిధ కారణాలు చూపెట్టి, బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తులపైనా ఎస్‌పి ప్రత్యేక దృష్టిపెట్టారు. ఫిర్యాదులు రాగానే.. అన్ని పరిశీలించి నిజమని తేలితే వెంటనే ఎక్స్‌టార్షన్ చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కొందరు యువకులపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా తమను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటి వరకు ఏడెనిమిది మంది విలేకరులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

పలువురిని రిమాండ్‌కు తరలించారు. పశువుల వాహనాలను ఆపి చంపుతానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వడ్డీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న వారిని సైతం గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అఖిల్ మహాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ముందుగా రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాపై స్పెషల్ నజర్ పెట్టారు. కత్తులు, కటార్లు, తల్వార్లతో రీల్స్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిని గుర్తించి కటకటాల వెనక్కి పంపారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో రౌడీషీటర్లతో రౌడీ మేళా సమావేశం నిర్వహించి వార్నింగ్ ఇచ్చారు. జనాలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో ఎక్స్‌ట్రాలు చేస్తే ఊరుకునేది లేదని, ప్రవర్తన మార్చుకోకపోతే పిడి యాక్ట్‌లు సైతం నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎస్‌పి నేతృత్వంలో జిల్లా పోలీసులు అనేక కేసులను ఛేదించారు. ఇచ్చోడ మండలంలో జరిగిన ఫేక్ సర్టిఫికెట్ స్కామ్‌ను సైతం వెలుగులోకి తీసుకొచ్చారు. పదివేలకు ఓ బాలికను విక్రయించిన కేసును సైతం ఛేదించారు. రేషన్ బియ్యాన్ని 25 కిలోల బ్యాగుల్లో ప్యాక్ చేసి ప్రైవేట్ దుకాణాల్లో విక్రయిస్తుండగా, దాడి చేసి పట్టుకున్నారు. వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించి శబ్దకాలుష్యం చేస్తుండగా.. అలాంటి సైలెన్సర్లను తొలగించి వాటిని నాశనం చేశారు. అంతర్రాష్ట్ర ఆటోల దొంగల ముఠాను సైతం అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్‌పి అన్ని అంశాలపైనా దృష్టి పెడుతున్నారు. సైబర్ క్రైమ్స్‌ను నియంత్రించేలా అవగాహన కల్పిస్తున్నారు.

ప్రతి సోమవారం ఎస్‌పి ఆఫీసులో ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించి వందలాది మంది నుంచి కంప్లయింట్స్ స్వీకరిస్తున్నారు. వాటికి పరిష్కారం చూపేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లేలా కృషి చేస్తున్నారు. మత్తు వల్ల జరిగే దుష్పరిణామాలపై అవగాహన కలిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5కె రన్ సైతం నిర్వహించారు. వర్షాకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో వరదలు వస్తే ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా 20 మందితో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. యువతులు, మహిళలు, చిన్నారుల భద్రత కోసం ‘అభయ మై ట్యాక్సీ ఇన్ సేఫ్’ అనే కార్యక్రమాన్ని చేపట్టి.. డ్రైవర్ల వివరాలు ఈజీగా తెలిసేలా మూడువేలకు పైగా ఆటోలను ఇందులో రిజిస్ట్రేషన్ చేయించారు. గిరిజన, మారుమూల గ్రామాల్లో ‘పోలీసులు మీ కోసం’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • మహ్మద్ సాబీర్
    98492 31002
    (ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News