Monday, July 7, 2025

చెరువుల్లో రిసార్టులు… నిబంధనలకు తూట్లు

- Advertisement -
- Advertisement -

పలుచోట్ల ఇరిగేషన్ భూములను ఆక్రమించి నిర్మాణాలు
జాగ్రత్తలు పాటించకుండా బోటింగ్.. రాజకీయ పార్టీల అండదండలు
అనుమతి లేని రిసార్టులపై కఠిన చర్యలు:డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలోని అనంతగిరి కొండల పరిసర ప్రాంతాల్లో పలు రిసార్టులు ని బంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. రిసార్టుల నిర్వహణకు అనుమతులు లేకున్నా రాజకీయ అండదండలతో నడుస్తున్నాయి. శని, ఆదివారాల్లో మద్యం, మత్తు పదార్థాలు దర్జాగా సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మద్యం, మత్తు పదార్థాలకు ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ రాత్రంతా భారీ శబ్దాలతో డిజె లను ఏర్పాటు చేసి సరదాగా గడుపుతున్నారు. డిజెల భారీ శబ్దాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎ దురవుతున్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రిసార్టుల్లో మద్యం వినియోగంపై ఆబ్కారీ అధికారులు కనీ సం తనిఖీలు నిర్వహించకుండా మామూళ్లు తీసుకుంటూ నిమ్మకు నీరుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అనంతగిరి పర్యాటక కేంద్రం కావడంతో చుట్టుపక్కల గ్రామాలైన కెరెల్లి, కొండాపూర్, ఉర్దూ జైలుపల్లి, సర్పంచ్ పల్లి, గోధుమగూడ, బూరుగుపల్లి పరిసర ప్రాంతాలలో రిసార్టులను ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఆదాయాన్ని గడిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడల్లా కొన్ని రోజులు మూసివేసి మళ్లీ కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటిగా మారింది.

రిసార్టులకు అత్యధికంగా సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, పురుషులు కలిసి వస్తున్నారు. వీరు రిసార్టులలో బస చేసే సమయంలో ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా నిబంధనలను తుంగలో తొక్కి మహిళలు, పురుషులను ఒకే దగ్గర ఉండేందుకు అనుమతులు కూడా ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సర్పంచ్‌పల్లి ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా బోటింగ్ నిర్వహిస్తూ ప్రాజెక్టు నీటిలో గుడారాలు ఏర్పాటు చేసి పర్యాటకులు సరదాగా గడిపేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పర్యాటక శాఖ నుంచి బోటింగ్ అనుమతులను కొన్ని రిసార్ట్‌ల నిర్వాహకులు తెచ్చుకున్నా నిబంధనలను పాటించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ప్రైవేట్ దందా కొనసాగుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ బోటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేలా సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చేస్తున్నారు. ఇవేమీ పట్టనట్లుగా ప్రభుత్వ అధికారులు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రకటనల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రైవేట్ దందాలు వెలుగుచూస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో, నియంత్రణలేదనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అధికార అనుమతులు లేకుండానే రిసార్ట్ నిర్వాహకులు ఇరిగేషన్ ప్రాజెక్టు జలాశయంలో బోటింగ్ నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరిని బలి తీసుకుంది. మరో ముగ్గురు ప్రమాదంలో చిక్కుకోగా, స్థానికులు అప్రమత్తమై వారిని రక్షించారు. బోటులో లైఫ్ జాకెట్లు లేకపోవడం, భద్రతా చర్యల లేమి ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా బోటింగ్ కార్యకలాపాలు కొనసాగుతుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార అనుమతులు లేకుండానే రిసార్ట్ నిర్వాహకులు ఈ దందాలు నిర్వహిస్తుండగా, ప్రాజెక్టు పరిసరాల్లో హుక్కా సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఇరిగేషన్ భూములను ఆక్రమించి నిర్మాణాలు
స్థానికుల వివరాల ప్రకారం, ఇరిగేషన్ శాఖ భూములు అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తెలుస్తోంది. రిసార్ట్‌కు సరైన పర్మిషన్లు లేవని, అయినప్పటికీ యథేచ్ఛగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దందాలపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోతున్నా కూడా చర్యలు తీసుకోకపోవడం విచారకరమని వాపోతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని అక్రమ దందాను అరికట్టాలని కోరుతున్నారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న అక్రమ కార్యకలాపాలను తక్షణమే అణచివేయాలని, ప్రజల భద్రతకు గణనీయమైన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అనుమతి లేని రిసార్టులపై కఠిన చర్యలు: డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి
వికారాబాద్ చుట్టూ ఉన్న రిసార్టులలో మద్యం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చెరువులో అనుమతి లేకుండా ఎవరు కూడా బోటింగ్ చేయొద్దన్నారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో బోటు బోల్తా పడి ఇద్దరు మృతి చెందడంతో పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News