కథ: పారి అలియాస్ పార్వేల్ కన్నన్ (సూర్య) చిన్నతనంలోనే పుట్టిన ఊరికి.. తల్లిదండ్రులకు దూరమవుతాడు. అనాథగా ఉన్న అతన్ని గ్యాంగ్‌స్టర్ తిలక్ (జోజు జార్జ్) భార్య దగ్గరకు తీసుకుని పెంచుతుంది. తనకి ఇష్టం లేకున్నా భార్య కోరిక మేరకు తిలక్ అతన్ని కొడుకుగా అనుకుంటాడు. ఓ ప్రయాణంలో ఉండగా తిలక్‌ను శత్రువులు హతమార్చాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్రమాదం నుంచి పారి తన తండ్రిని కాపాడతాడు. అప్పటి నుంచి అతన్ని ఐరన్ హ్యాండ్‌గా భావించి కొడుకులా చూస్తాడు. .తిలక్‌తోపాటు పారి కూడా గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. చిన్నతనంలో పరిచయమైన రుక్మిణి 15 ఏళ్ల తర్వాత తారసపడటంతో ఇద్దరు ప్రేమించి పెళ్ల్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి తర్వాత గ్యాంగ్‌స్టర్ జీవితానికి ఫుల్‌స్టాప్ పెడతానని రుక్మిణికి మాటిస్తాడు. ఆ తర్వాత అతనికి ఎదురైన పరిణామాలేంటి? తిలక్‌తో అతనికి వైరం, గోల్డ్ ఫిష్ గొడవ ఏంటి? మళ్లీ హింసాత్మక వృత్తిలోకి సూర్య ఎందుకు దిగాడు.. ఓ దీవిలో ఉన్న ఊరుకి, పారికి సంబంధం ఏంటి అన్నది మిగతా కథ.
విశ్లేషణ: పెద్ద స్టార్ అయినప్పటికీ.. మిగతా స్టార్ల మాదిరి రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేయడు సూర్య. అతను ఎంచుకునే కథల్లో కొత్తదనం ఉంటుంది. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ సాగిపోవడమే సూర్య ప్రత్యేకత. ఈ నేపథ్యంలో అతను విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో జట్టు కట్టి రొటీన్‌కు భిన్నమైన కథ ‘రెట్రో’తో ప్రేక్షకులను మైమరపించాడు. ఈ సినిమాలో ఫస్టాఫ్ మంచి బలం అని చెప్పవచ్చు. మేకర్స్ ప్రకటించిన లవ్, లాఫ్టర్, వార్ పాయింట్స్‌కి తగ్గట్టుగా నడిపిన కథనం ఆసక్తికరంగా సాగుతుంది.
ఈ క్రమంలో సూర్య నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. తనలోని నటుడిని మిస్ అవుతున్న వారు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో సూర్య జీవించేశాడు అని చెప్పేశారు. అలాగే తనపై పలు క్రేజీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో సూర్య అద్భుతమైన నటన ప్రేక్షకులను మైమరపించింది. ఇంకా పూజా హెగ్డే తన రోల్ లో బాగానే చేసింది. వీరితో పాటుగా జోజు జార్జ్, జయరామ్, నాజర్‌లు డిఫరెంట్ పాత్రల్లో కనిపించి మెప్పించారు. అలాగే నెగిటివ్ రోల్‌లో కనిపించిన యంగ్ నటుడు విదు తన పాత్రలో మంచి నటనని అందించాడు. ఆద్యంతం ఊహించని ట్విస్టులతో సాగుతూ ‘రెట్రో’ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది.