Friday, July 18, 2025

తెలంగాణ హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నేతలు స్పందించకపోవడమనేది దారుణమని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. ఈ విషయం బిఆర్‌ఎస్ నేతల విజ్ఞతకే వదిలివేస్తున్నానని, తన దారికి భారత రాష్ట్ర సమితి నేతలు రావాల్సిందేనని స్పష్టం చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాతనే బిసి రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. రెండు బిల్లులు పెట్టాలని తొలుత డిమాండ్ చేసింది కూడా తానేనని తెలియజేశారు. బనకచర్లపై చర్చకు వెళ్లనని సిఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని, బుధవారం ఢిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల అని పేర్కొన్నారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించడం మంచి పద్దతి కాదని హితువు పలికారు. ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య బనకచర్ల ప్రాజెక్టుపై చర్చలు జరిపారని తెలియజేశారు.

బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాలు హక్కులు తెలంగాణ రాష్ట్రం కోల్పోతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు గోదావరి జలాలను ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారని దుయ్యబట్టారు. బనకచర్లతో తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి చెప్పడం లేదని కవిత చురకలంటించారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ఏడారిగా మారే అవకాశం ఉందన్నారు. తెలంగాణ హక్కులను చంద్రబాబు నాయుడు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని, దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలించే హక్కులేదని, తక్షణమే రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు.

గోదావరి రివర్ మెనేజ్‌మెంట్ బోర్డు హైదరాబాద్‌లో ఉంటే కృష్ణా రివర్ మెనేజ్‌మెంట్ విజయవాడలో ఉంటుందని విభజన చట్టంలో ఉందని చెప్పారు. రెండు నదులకు సంబంధించిన బోర్డు విషయంలో రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని చురకలంటించారు. మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రిపేర్లు తెలంగాణ ప్రభుత్వం చేయాలని, ఎపి భూభాగంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ రిపేర్లు చంద్రబాబు ప్రభుత్వం చేయాలని విభజన చట్టంలో ఉందన్నారు. నదులు అనుసంధానం విషయంలో కమిటీలు ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏమీ లేదని కవిత మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News