హైదరాబాద్: వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద కామారెడ్డిలో వచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చూశారని అన్నారు. కామారెడ్డిలోని జిఆర్ కాలనీకి రేవంత్ చేరుకున్నారు. వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్ అండ్ బి బిడ్జ్ ను పరిశీలించారు. బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులను తలెత్తకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, బ్రిడ్జ్ కమ్ బ్యారేజి లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సిఎం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని నేతలకు సూచిస్తున్నానని, వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు. మీ కష్టాలకు జరిగిన నష్టాలను చూడడానికే ఇక్కడికి వచ్చామని, శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ఇసుక మేటలు తొలగించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామని, కామారెడ్డిలో వరదలకు దెబ్బతిన్న పంటలకు నష్టం పరిహారం అందిస్తామని తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు వరద నష్టాన్ని అంచనా వేయాలని చెప్పారు. వరద బాధితులని పరామర్శించి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Also Read : రేవంత్ రెడ్డి కాళ్లను హరీష్ రావు మొక్కారనడం బాధ కలిగించింది: పద్మా దేవేందర్ రెడ్డి