హైదరాబాద్: దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశానిర్దేశం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పటి ప్రధాని నెహ్రూ కేవలం ప్రసంగాలతో సరిపెట్టలేదని, పటిష్ట భారత్ కోసం ఎన్నో చర్యలను చేపట్టారని గుర్తు చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సిఎం ప్రసంగించారు. అహింసా పద్ధతిలో మహాసంగ్రామాన్ని గెలిచామని, స్వాతంత్య్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని, 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందన్నారు. దేశ భవిష్యత్ మనల్ని పిలుస్తోందని నెహ్రూ చేసిన ప్రసంగం చిరస్మరణీయమని, నెహ్రూ స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశానిర్దేశం చేశారని, మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని, నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని, ఆనాడు పెద్దలు వేసిన పునాదులతోనే నేడు దేశం సుసంపన్నంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతోందని, ప్రపంచ నగరాలతో పోటీ పడే నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నామని, మరోవైపు పేదల సంక్షేమంలో సరికొత్త చరిత్ర రాస్తున్నామని, సంక్షేమానికి కేరాఫ్ అంటే కాంగ్రెస్ పాలన అని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని, సన్నబియ్యం పథకం కేవలం ఆకలితీర్చే పథకం కాదు అని, సన్నబియ్యం పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ప్రజాప్రభుత్వం వచ్చాకే పేదల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, రేషన్ షాపులు పేదవాడి ఆకలి తీర్చే భరోసా కేంద్రాలుగా మరాయని కితాబిచ్చారు. గత సంవత్సరం ఆగస్టు 15న రెండు లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టామని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని సగర్వంగా నిలబడ్డామని, విత్తనాలు వేసేనాటికే రైతుల ఖాతాల్లో రైతుభరోసా ఇచ్చామని, పరిమితులు లేకుండా తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు వేశామని వివరించారు. రైతు పండించిన చివరిగింజ వరకు ధాన్యం సేకరిస్తున్నామని సిఎం పేర్కొన్నారు.
ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని, తెలంగాణలో 78 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ప్రభుత్వం రైతులకు అండగా నిలవడంతో తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచిందని మెచ్చుకున్నారు. కాళేశ్వరంలో నుంచి చుక్కనీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించామని, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరామ్‌సాగర్, కోయిల్‌సాగర్‌తో వరి పండిస్తున్నామని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని, గత ప్రభుత్వం పదేళ్ల పాటు పేదలకు సొంతింటి కలలను దూరం చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని, మధ్యవర్తులు లేకుండానే పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్‌ఎలోనే ఉందని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి 2న బిల్లు తీసుకొచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, బిసి బిల్లులను త్వరంగా ఆమోదించాలని గోల్కొండ కోటపై నుంచి మారిసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.