హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడిని సిఎం రేవంత్ దర్శించుకున్నారు. మహాగణపతికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. మతసామరస్యానికి హైదరాబాద్ ప్రతీక అని, ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.
ఒక్క అడుగు ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడు, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడని ప్రశంసించారు. నగరంలో ఎన్ని విగ్రహాలు ఉన్న ఖైరతాబాద్ వినాయకుడి పోటీ రారని తెలియజేశారు. ఎన్ని ఇబ్బందులున్నా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ముందుకు వెళ్తోందని రేవంత్ కొనియాడారు. నగరంలో లక్షా 40 వేల విగ్రహాలు ఉన్నాయని, గణనాథులకు అన్ని రాకల ఏర్పాటు చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో ఎక్కువ గణపతులను పూజించుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఘనంగా జరుగనుంది. రేపు ఒంటి గంటకు హుస్సేన్ సాగర్ లో క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేయనున్నారు.