Sunday, May 4, 2025

మానవత్వం పరిమళించిన వేళ…

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరగడం ఇప్పుడు కొత్తేమీ కాదు. కానీ ఈ దాడి కొన్ని అనూహ్య పరిణామాలకు అవకాశం కల్పించింది. ఉగ్రవాదులు ఒక మతం వారిని లక్షంగా చేసుకుని భయాందోళనలు కలిగించడానికి బీభత్సాన్ని సృష్టించారు. హిందువులను, ముస్లింలను వేరు చేసి, అలాగే పురుషులను, మహిళలను వేరు చేసి ఊచకోతకు పాల్పడ్డారు. ఇస్లాంపై నమ్మకం ఉందని కలిమా సంస్మరించమన్నారు. అలా చేసిన వారిని విడిచిపెట్టారు. ఇది పాకిస్థాన్ అండదండలతో లష్కరే ఇ తొయిబా ప్రేరణతో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రమూక సాగించిన దాడి. ఇది భారత్‌కు ఒక ప్రమాద హెచ్చరిక. భారతీయులకు భారతీయులే శత్రువులు అయ్యేలా చేయడం, భయం, ద్వేషం పుట్టించి భారత్‌ను వర్గాలుగా విభజించడం, పర్యాటకులకు భయం కలిగించడం ప్రధాన ఉద్దేశాలుగా ఉగ్రతోడేళ్లు తమ మారణకాండ సాగించాయి.

కానీ వారు అనుకున్నట్టు పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులకు స్థానికులు ఎవరూ భయపడలేదు. పైగా కులమతాలకు అతీతంగా అంతా ఏకమై బాధితులను ఆదుకున్నారు. వారికి సంఘీభావం ప్రకటించారు. ఉగ్రదాడికి నిరసనగా వ్యాపారాలు, ఇతర సంస్థలు మూతపడ్డాయి. ఇదివరకెన్నడూ లేనంతగా ఉగ్రవాదులను ద్వేషించే పరిస్థితి ఏర్పడింది. మానవత్వం పరిమళించింది. పహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఎక్కడైతే ఉగ్రదాడి జరిగిందో అక్కడ స్థానిక కశ్మీర్ ముస్లింలు గాయపడిన పర్యాటకులను తక్షణం ఆదుకున్నారు. అక్కున చేర్చుకుని వారికి ఆశ్రయం కల్పించారు. గాయపడిన కొందరిని ఎత్తైన కొండలపై నుంచి కిందకు మోసుకెళ్లి వైద్య చికిత్స అందించారు. స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారికి రవాణా సౌకర్యం కల్పించారు. 20 ఏళ్ల పొనీగైడ్ సయ్యద్ అదిల్ హుస్సేన్ షా, తన కుటుంబానికి తానే ఆధారం.

ఒక పర్యాటకుడిని కాపాడడానికి తాను తెగించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ధైర్యసాహసాలు ఒక్కటే చాలు విద్వేషపూరిత మృగత్వాన్ని చీల్చి చెండాడడానికి. విద్యావేత్త దేబవిష్ భట్టాచార్య ఉగ్రవాదుల తుపాకీ గురి నుంచి బయటపడ్డారు. ఉగ్రవాదులు ఆదేశించినట్టుగానే కలిమా జపించి ప్రాణాలు దక్కించుకున్నారు. తనను రక్షించిన స్థానికుల ధైర్యసాహసాలను ఆయన పదేపదే ప్రశంసించారు. తమ పోనీ గైడ్ తమను వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్లాడని ఆయన గుర్తు తెచ్చుకున్నారు. ఈ మానవత్వ సహాయ సంఘటనలు వింటుంటే మనల్ని ఆప్యాయత, మానవత్వాలతో కట్టి పడేస్తాయి. భారత దేశంలో జీవిస్తున్న సౌభ్రాతృత్వ మూలాలను తెలియజేస్తాయి. ఏప్రిల్ 23న కశ్మీర్ అంతా బంద్ అయింది. అది భయంతో కాదు.

బాధితులకు సంఘీభావం తెలియజేయడానికి. కశ్మీర్‌లోని పొలాలు పంట చేతికి రాకముందే కోతకు గురవుతున్నాయి. ప్రతికూల వాతావరణం వల్ల కాదు. హింసాకాండ మళ్లీ ఎదురవుతుందన్న భయంతోనే అలా చేస్తున్నారు. ఏం జరిగినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని స్థానికులు ధైర్యంగా చెబుతున్నారు. కానీ కొందరు ముస్లింలపై శత్రుత్వం చూపిస్తున్నారు. ఉగ్రవాదులు ముస్లింలను విడిచిపెట్టి మిగతా మతాల వారిని ఊచకోత కోసారు కాబట్టి ముస్లింలే ఈ హింసాకాండకు ప్రేరేపిస్తున్నారని మతోన్మాదంతో పేట్రేగిపోతున్నారు.మతోన్మాదం అంటే దేశభక్తి కాదు. ఇది ధైర్యం ముసుగులో ఉన్న పిరికితనం. ఈ ఉన్మాదం లోపలి నుంచి మనిషిని బలహీనపరుస్తుంది. దీనికి ఏమాత్రం మొగ్గు చూపినా ఎవరైతే భారత్‌ను ముక్కలు ముక్కలుగా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రపంచ వేదికపై భారత్ తడబాటు చెందాలని ఆకాంక్షిస్తున్నారో అలాంటి తీవ్రవాద, ఉగ్రవాద తోడేళ్ల చేతుల్లోకి పరిస్థితి వెళ్లిపోతుంది.

అందుకనే ఈ కష్టసమయంలో అందరం భారతీయులం, ఒకేమాటపై, ఒకే బాటపై ముందుకు సాగి ఉగ్రవాదులను తరిమికొడదాం అన్న దృఢసంకల్పంతో ఐక్యతా భావాన్ని పెంపొందించుకోవాలి. జాతీయ బలం అంటే ఆగ్రహం మాత్రమే కాదు. ఒకదేశం కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. న్యాయానికి, కరుణకు, ఐక్యతకు కట్టుబడి ఉంటుందన్న వాస్తవాన్ని పహల్గాం సంఘటన కళ్లముందు సాక్షాత్కరింపచేసింది. అయితే డెహ్రాడూన్ వంటి ప్రాంతాల్లో కశ్మీర్ ముస్లిం విద్యార్థులపై ద్వేషం కక్కుతూ బెదిరింపులు రావడం అత్యంత శోచనీయం. ఆ ప్రాంతం లోని సామాజిక మాధ్యమాలు కూడా ద్వేషం ప్రచారం చేశాయి. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని సంబంధిత బాధ్యులపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులే ఇతర ప్రాంతాల నుంచి కూడా రావడం గమనార్హం. ఇలాంటి సంఘటనలను వ్యతిరేకించకుండా కేవలం మతం కారణంతో కశ్మీర్ ముస్లిం విద్యార్థులను టార్గెట్ చేస్తే ఉగ్రవాదులకు మనకూ తేడా ఏమిటి? అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది.

డెహ్రాడూన్‌ను కశ్మీరీ ముస్లిం విద్యార్థులు విడిచిపెట్టకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తూ ఒక వీడియో విడుదలైంది. ఈ విధంగా బెదిరించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు పెట్టినంత మాత్రాన ఈ ద్వేషభావాలు సమసిపోవు. వారిలో జాతీయ భావం, దేశభక్తి నెలకొనే చర్యలు అవసరం. కేవలం ఒక మత విశ్వాసాన్ని బట్టి ప్రజలను కళంకం చేయడమంటే దేశం మొత్తం మీద కశ్మీరీ ముస్లింలను అవమానించడమే అవుతుంది. ఈ విషయంలో తనిఖీ చేసుకోకపోతే దేశంలో మరింత తీవ్రమైన మత ఉద్రిక్తతకు దారి తీయవచ్చు. అది ఉగ్రవాద కట్టడి చర్యల నుంచి, పాక్ దురాక్రమణ నివారించే యత్నాల నుంచి దృష్టిని మళ్లిస్తుంది. పాకిస్థాన్ మిలిటరీ, పాక్ నాయకత్వం, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తోసహా హిందువులు, ముస్లింలు భిన్నధ్రువాలని ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో దేశ భద్రత కోసం, రక్షణ కోసం మనల్ని ఏకం చేసేది ఏమిటన్నది ఆలోచించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News