Saturday, July 12, 2025

ఆకట్టుకోలేకపోయిన క్రైమ్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

‘మొగలిరేకులు’ టీవీ సీరియల్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్‌కె సాగర్ ‘ది 100’ సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాఘవ్ ఓంకార్ శశిధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ: విక్రాంత్ (ఆర్కే సాగర్) యువ ఐపీఎస్ అధికారి. ట్రైనింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ సిటీలో ఏసీపీగా చేరిన అతడికి ఒక కేసు సవాలుగా మారుతుంది. అమావాస్య రోజు దొంగతనాలు చేస్తూ బంగారం దోచుకుంటున్న ఒక ముఠా.. ఈ క్రమంలో హత్యలు కూడా చేస్తుంటుంది. ఇదే ముఠా.. ఒక ఇంటి మీద దాడి చేసినపుడు ఆర్తి (మిషా నారంగ్) అనే అమ్మాయిని రేప్ చేస్తుంది. దీంతో విక్రాంత్ మరింతగా ఈ కేసు మీద ఫోకస్ చేస్తాడు. విక్రాంత్ కష్టపడి ఈ ముఠాను పట్టుకున్నాక కొన్ని సంచలన విషయాలు బయటికి వస్తాయి. ఆర్తి రేప్ వెనుక ఉన్నది వేరే వ్యక్తులని తెలుస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తులెవరు.. వీరి వెనుక ఉద్దేశాలేంటి.. మొత్తంగా ఈ కేసును విక్రాంత్ ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.

కథనం విశ్లేషణ: ఒక క్రైమ్.. దాన్ని అనుసరిస్తూ అదే తరహాలో మరి కొన్ని నేరాలు.. ఈ కేసును పరిష్కరించడానికి వచ్చే ఒక పోలీసాఫీసర్.. తీగ లాగితే డొంక కదలడం.. ఈ క్రమంలో ట్విస్టుల మీద ట్విస్టులు.. తెర వెనుక ఏం జరిగిందో చూపించే ఒక ఫ్లాష్ బ్యాక్.. చివరగా నేరస్థుల ఆటకట్టు… ఈ తరహాలో గతంలో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘ద 100’లో దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ తరహా ప్రయత్నమే చేశాడు. దోపిడీ-హత్యలకు సంబంధించిన కేసును యువ ఐపీఎస్ అధికారి ఛేదించే క్రమంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కాన్సెప్ట్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కొన్ని ట్విస్టులు కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి. కొన్ని ఎపిసోడ్ల వరకు బాగానే డీల్ చేశారు. కానీ ‘ద 100’ పూర్తి స్థాయిలో ఒక పకడ్బందీ థ్రిల్లర్ గా మాత్రం రూపొందలేకపోయింది. క్రైమ్ ఎలిమెంట్ తెర వెనుక కథ చాలా అసహజంగా.. అనాసక్తికరంగా ఉండడం దీనికి కొంత మైనస్ అయింది.

దీనికి తోడు థ్రిల్లర్ సినిమాలకు అత్యంత కీలకం అయిన రేసీ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. క్రైమ్ వెనుక నేపథ్యాన్ని దర్శకుడు సరిగా చూపించలేకపోయాడు. ఒక కార్పొరేట్ కంపెనీ కేవలం అమ్మాయిల అందాల మీద పెట్టుబడి పెట్టి తమ సంస్థను రన్ చేయడం.. ప్రాజెక్టులు దక్కించుకోవడం అన్నది చాలా అసహజంగా అనిపిస్తుంది. దాని మీద పెద్ద స్కామ్ నడవడం.. ఇదే కథకు కీలకమైన క్రైమ్‌కి దారితీయడం.. ఇదంతా ఏమాత్రం బాగా అనిపించదు. కథ మధ్యలో వచ్చే ట్విస్ట్ చూసి భలేగా ఉందనిపిస్తుంది కానీ.. తర్వాత రెండు వేర్వేరు నేరాలకు ముడిపెట్టిన తీరు కూడా కొంచెం కృత్రిమంగానే తోస్తుంది. ఇక ఐపీఎస్ అధికారి పాత్రలో ఆర్కే సాగర్ పర్వాలేదనిపించాడు. హీరోయిన్ మిషా నారంగ్, ధన్య బాలకృష్ణన్ నటన అంతంత మాత్రంగానే ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News